YS Viveka Murder Case | వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో నిందితులు, సాక్షులు వ‌రుస మ‌ర‌ణాలు అనుమాన‌స్ప‌దంగా ఉంద‌ని, కుట్ర‌కోణం దాగిఉందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని ఏపీ సివిల్ స‌ప్లై శాఖ మంత్రి, జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయ‌న‌ అన్నారు. శనివారం రాత్రి జగ్గంపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 


గ్రావెల్ పై సంపాదన గురించి వైసీపీ నాయకులు


వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దుర్మార్గంగా పాలించారు. సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారో...   గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనందరం చూశాం. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్ పై వచ్చిన సంపాదన గురించి ఆలోచించారు తప్ప ... యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయలేదని  మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూశాం. గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా పల్లెల్లో పండగ వాతావరణం చూశామా..? ప‌వ‌న్‌ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ ఎనిమిది నెలల కాలంలో గ్రామాల్లో 3300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. ఒకే రోజు 13371 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ప్రజల పక్షాన బలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.. 


వివేకా హత్య కేసులో సాక్షుల మరణం అనుమానాస్పదం


మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఒక వైపు విచారణ కొనసాగుతుంటే... మరో వైపు ఆ హత్యకు సంబంధించిన సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేశాడు. ఐదేళ్లు దౌర్జన్యంగా వ్యవహరించిన ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యం, పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయమే చేస్తుంది. అన్నవరంలో వారాహి యాత్ర మొదలైనప్పుడు ప్రజలకు అండగా ఉంటామని మాట ఇచ్చాం. మాటకు కట్టుబడి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిపెడుతున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ. 900 కోట్లు ఖర్చు చేసి 96 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమని గత ప్రభుత్వం అంటే... వాలంటీర్లు లేకపోయినా కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తోంది. గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు పెండింగ్ పెడితే ... కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బకాయిల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొన్న 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే రూ. 7800 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు చేశాం. రూ. 7752 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేశాం అని తెలిపారు. 


మీ అందరి కష్టంతోనే మాకు పదవులు 


జనసేన పార్టీ ప్రస్థానం మొదలైనప్పుడు ఎవరూ పదవుల కోసం ఆలోచన చేయలేదు. ఈ రోజు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులుగా అసెంబ్లీలో కూర్చున్నాం అంటే దానికి ప్రధాన కారణం జన సైనికులు, వీర మహిళలు క్షేత్రస్థాయిలో పడిన కష్టం. మీరు లేనిదే మేము లేము. మీరందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసి మేము గెలిచేలా చేశారు. పార్టీలో నాయకులు ఉన్నా లేకపోయినా జనసేన జెండా పట్టుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. మీలాంటి జన సైనికులు, వీరమహిళలకు కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ.  పండగ వాతావరణంతో సభను నిర్వహిద్దాం. మన అధినాయకుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ సభను నిర్వహిస్తున్నాం.  ఊరూవాడ అంతా సభకు తరలి వచ్చేలా చూసి సభను జయప్రదం చేద్దామన్నారు.  
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఛైర్మన్  తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జి  తుమ్మలపల్లి రమేష్, మండపేట నియోజక వర్గ ఇంఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, ఆవిర్భావ సభ జగ్గంపేట నియోజక వర్గ సమన్వయకర్తలు అక్కల గాంధీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.