AP Liquor Policy | కొత్త మద్యం పాలసీను చాలా పారదర్శకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం.. లైసెన్స్డ్ దుకాణ దారులు నిభందనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. బెల్డ్ షాపులు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులలకు రూ.5 లక్షలు జరిమానా విధిస్తాం. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుచేస్తాం.. మద్యం బెల్డ్ షాపుల గురించి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్న మాటలివి..
క్షేత్రస్థాయిలో ఏరులై పారుతున్న మద్యం
కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరే లెవెల్లో ఉంది.. గ్రామాల్లో వీధి వీధికో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి పెద్దమొత్తంలో మద్యం తెచ్చి విడిగా విక్రయాలు యధేచ్ఛగా సాగిస్తున్నారు. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్ షాపులు పట్టపగలే యధేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయి. పైగా తాము పార్టీకోసం పనిచేశామని, మమ్మల్ని ఎవడ్రా ఆపేదన్న రీతిలో అమ్మకాలు చేస్తున్నారు. లిక్కర్ షాపుల కంటే బెల్ట్ షాపుల్లోనే భారీగా విక్రయాలు జరుగుతున్నాయని వైసీపీ సైతం ఆరోపిస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులే గ్రామాల్లో కొంత మంది పేర్లు ప్రతిపాదించి బెల్టుషాపులు నిర్వహించుకోండని చెప్పారని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. బాగా విక్రయాలు జరిగే షాపుల్లో వాటా చొప్పున వసూళ్ల పర్వం నడుస్తుందని అంటున్నారు. కొందరు ద్వితీయశ్రేణి నాయకులు అయితే వాటాల చొప్పున విడగొట్టి దానిలో కొంత పెర్సంటేజ్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
సిండికేట్‌గా మారి బెల్ట్‌షాపులకు ప్రోత్సాహం..
ఏపీలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లాటరీల ద్వారా లైసెన్స్‌లు ఇచ్చింది ప్రభుత్వం.. ఈ ఏడాది అక్టోబర్ 13 న నిర్వహించిన లాటరీ ద్వారా జిల్లాల వారీగా లాటరీలు నిర్వహించి గెలిచిన వారికి లైసెన్స్‌లు ఇచ్చి నిర్వహణ బాద్యతలు అప్పగించింది.. వీటితో పాటు ముఖ్యనగరాలైన విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో మొత్తం 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటుకు కూడా ఇదే తరహాలో అనుమతులు ఇచ్చింది. అయితే ఇప్పుడు చాలా దుకాణాలకు సంబందించి సిండికేట్లుగా ఏర్పడి లాటరీల్లో పాల్గన్నవారు ఇప్పుడు సిండికేట్‌గానే వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలోనే మండలాల వారీగా సిండికేట్లుగా మారి బెల్టుషాపులను పరోక్షంగా ప్రోత్సహించి విక్రయాలు జరుపుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది..
బెల్టుల నిర్వహణకు వేలం పాటలు సైతం...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం నియోజకవర్గంలో ఓ తీర గ్రామంలో అయితే గ్రామ పెద్దలు గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహించుకునేందుకు వేలంపాట నిర్వహించారని సమాచారం. ఈవేలంలో రూ.8లక్షలు విడతల వారీగా చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్న ఓ వ్యక్తి ప్రస్తుతం బెల్టుషాపు నిర్వహించుకుంటున్నాడని తెలుస్తోంది.. ఇదే తరహాలో చాలా గ్రామాల్లో వేలం పాటలు సాగుతున్నట్లు సమాచారం. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో ఇదే తరహాలో వేలం పాటలు జరగ్గా వేలం పాటకూడా కూటమిలోని వారికే దక్కాలన్న నిబంధన అమలు చేశారని తెలుస్తోంది.. ఇక రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం, రామచంద్రపురం, మండపేట ఇలా అక్కడ ఇక్కడ అని కాక అన్నింటా ముఖ్యంగా తీరగ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణకోసం వేలం పాటలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది..
ఎమ్మెల్యేలపై ఆరోపణలు...
ఉభయ గోదావరి జిల్లాల్లో నడుస్తోన్న బెల్ట్‌షాపుల వెనుక ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరోక్ష మద్దతు ఉందన్న టాక్ నడుస్తోంది.. బాగా రద్దీగా సాగే బెల్ట్‌షాపుల నిర్వహణకోసం నెలకు రూ.50 వేలు వసూళ్లు నడుస్తున్నాయని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి ఆరోపణలను ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తిప్పి కొడుతున్నారు. నిజానికి బెల్ట్ షాపులున్నాయన్న సంగతి తమకే తెలియదు.. తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినదానికి కట్టుబడే ఉంటామని, ఆయన ఆదేశాల్ని బేఖాతరు చేయమంటున్నారు.. ఎమ్మెల్యేలు పెర్సంటేజ్‌లు తీసుకుంటున్నారన్న ఆరోపణలను ఖండిస్తున్నారు..