AP Goverment Developing Sea Plane In Konaseema: ఏపీని పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోంది. మరో పక్క విమానయాన శాఖ మంత్రి మన ఏపీకి చెందిన రామ్మోహన్‌ నాయుడే కావడంతో అటు విమానయానం పరంగా కూడా వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌(వాటర్‌ డ్రోమ్‌)ను సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సీ ప్లేన్లు నడిపే యోచనలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి ప్రధానంగా గోదావరిని ఆనుకుని ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కలిసొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. అటు, అధ్యాత్మికంగానూ, ఇటు ప్రకృతి రమణీయత కలగలిసేలా ప్యాకేజ్‌గా అందించాలని చూస్తోంది. ఇప్పటికే దీనిపై తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు సీప్లేన్‌ నిర్వాహణకు అనువైన ప్రాంతాలను గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వారు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కలిసొచ్చే ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు.


కోనసీమ అంటేనే ప్రకృతి..


ఉమ్మడి తూ.గో జిల్లా అనగానే అటు అధ్యాత్మికంగా, పర్యాటకంగా కలిసొచ్చేలా ప్యాకేజ్‌ ఉంటే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోటిపల్లి వద్ద గౌతమీ నదిలో గనుక సీప్లేన్‌ నడిపితే పక్కనే ఉన్న  అత్యంత పురాతన ప్రసిద్ధ ద్రాక్షారామం శైవక్షేత్రంతో పాటు అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం కూడా కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఓవైపు వెళ్లే వారు ద్రాక్షారామం, మరో వైపు వినాయక ఆలయం ఇలా రెండు పుణ్యక్షేత్రాలు కలిసి వస్తాయి గనుక ఇది అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు చెబుతున్నారు అధికారులు. ఇక అంతర్వేది పుణ్యక్షేత్రం, మరో వైపు దిండి రిసార్ట్స్‌ కలిసొచ్చేలా వశిష్ట నదీపాయలో కూడా సీప్లేన్‌ నిర్వహణకు మరో ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. ఇదిలా ఉంటే యానాం వద్ద వృద్ధ గౌతమి నదీపాయలో అయితే ఓ వైపు పుదుచ్చేరీ యానాం సొబగులు, మరో వైపు వీరేశ్వర స్వామి ఆలయం ఇలా రెండువైపులా కలిసొచ్చేలా మరో ప్లాన్‌ రూపకల్పన చేస్తున్నారు. ఇలా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈ విధమైన ప్రణాళిక రూపకల్పన చేస్తుంటే మరో పక్క తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరిలో సీప్లేన్‌ నిర్వహణకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే ఇక్కడ అన్ని సమయాల్లోనూ నీటి ప్రవాహం ఉండే పరిస్థితి ఉండదు గనుక దానికి అనుగుణంగా ధవళేశ్వరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్న యోచనలో అది కూడా పరిశీలన చేస్తున్నారు. 


ఎయిర్‌లైన్స్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా..


ఏపీలో ఎయిర్‌ లైన్స్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా సీప్లేన్‌లు నడిపే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సముద్రపు బ్యాక్‌ వాటర్‌తో ఎప్పుడూ ఉండే ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు. సీప్లేన్స్‌ కార్యకలాపాలకు అనువుగా సీప్లేన్‌ ల్యాండింగ్‌, యూటర్న్‌ తిరిగేందుకు రన్‌వేకు వీలుగా 1.8 ఎకరాల విస్తీర్ణం గల భూమిని గుర్తించాలని కూడా తెలిపినట్లు తెలిపారు. సముద్ర తీరం, ఐ.పోలవరం, పాసర్లపూడి, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాల్లో సీప్లేన్స్‌ నిర్వహణకు అనువుగా ఉంటాయని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించినట్లు చెప్పారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో సీప్లేన్స్ అభివృద్ధి చేస్తే అటు పర్యాటకంగా అభివృద్ధి జరగడం సహా ఇటు ప్రకృతి అందాల నడుమ పర్యాటకులకు ఓ కొత్త అనుభూతి కలుగుతుందని భావిస్తున్నారు.