కాపులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కానీ, వైసీపీ పార్టీకానీ చేసిందేమీ లేదని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. కాపులకు ఏమీ చేయలేని మంత్రులు అంబటి రాంబాబు, బొత్సా సత్యనారాయణ కాపుల తరపున అంబాసిడర్లలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంబటి కానీ, బొత్స కానీ కాపు కార్పోరేషన్‌ కమిషన్‌ వేయడానికి 40 లక్షలు ఇప్పించలేకపోయారు. మాజీ సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని, కార్పొరేషన్‌కు ప్రతీ ఏటా 1000 కోట్లు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు కాపులకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

జగన్మోహన్‌రెడ్డి జగ్గంపేట వచ్చి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పారని, కాపుల పథకాలన్నీ రద్దు చేశాడని ఆరోపించారు. అయిదు శాతం రిజర్వేషన్లు తీసేశారు. ఇప్పుడు కాపులకు మేమే చేస్తున్నాం, గొప్పోళ్లమని చెబుతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి కాపులకు చేసిందేమీ లేదు. వైసీపీ పాలనలో కాపులకు న్యాయం జరగదన్నారు. కాపులకు న్యాయం కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం కాపులకే కాదు బీసీలకు అందరికీ అన్ని విధాలా ఉద్దరించిన నాయకుడన్నారు. రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఏపార్టీల్లో అయినా పొత్తులు ఉంటాయని, వైసీపీ వన్నీ చీకటిపొత్తులు. సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ బలమైన పార్టీగా ఉందని, అప్పులపాలైన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలని చినరాజప్ప స్పష్టం చేశారు. 
 

ఆదిరెడ్డి కుటుంబానికి సంఘీభావం..


చిట్‌ఫండ్‌ కేసుల్లో రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసి రాజమండ్రి జైలుకు తరలించడం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఆ కుటుంబానికి సంఘీభావంగా రాజమండ్రి వస్తున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి భవానీ సోదరుడు కింజరపు రామ్మోహన్‌నాయుడు రాజమండ్రిలోనే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావులకు బెయిల్‌ మంజూరు కోసం ఇప్పటికే ప్రయత్నించగా శువ్రారం బెయిల్‌ మంజూరు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టీడీపీ మాజీ మంత్రులు, నాయకులు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని కలిసి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్ట్‌ అక్రమమని, రాజమండ్రిలో త్వరలోనే మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ అక్రమ అరెస్ట్‌లతో టీడీపీ నేతల్ని వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.