Janasena Plenary 2025: జనసేన పార్టీ ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది... 2014 మార్చి 14న ఏర్పడిన జనసేన 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసింది.. కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ 2024లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.. ఏకంగా పోటీచేసిన 21 స్థానాల్లోనూ నూరుశాతం ఫలితంతో విజయకేతనం ఎగురవేసింది.. పోటీచేసిన రెండు ఎంపీ స్థానాల్లోనూ గెలిచి తన సత్తా చాటింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో కీలక పదవులు సొంతం చేసుకుంది. డిప్యూటీ సీఎం, మంత్రిగా పవన్‌ కల్యాణ్‌, మంత్రులుగా పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌ కీలక శాఖల్లో మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.

ఎమ్మెల్యేగా నెగ్గి, ఏకంగా డిప్యూటీ సీఎం హోదా..

ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన ప్లీనరీ ఇప్పుడు తొలిసారిగా నిర్వహిస్తోంది.. అదికూడా జనసేన అధినేతను తొలిసారిగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురంలోనే భారీగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగా మార్చి 14వ తేదీన పిఠాపురం వేదికగా జనసేన ప్లీనరీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ఈ ఆవిర్భావ వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహించాలనుకున్నా, ప్లీనరీ ఒక్కరోజుకే పరిమితమవ్వడం మాత్రం జనసైనికులను నిరాశకు గురి చేసింది. అయితే ఒక్కరోజులోనే పార్టీ శ్రేణులకు, అభిమానులకు అధినేత పవన్‌కల్యాణ్‌ దిశానిర్దేశం చేయడంతోపాటు పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు నడిపించేందుకు విధి విధానాలు తన ప్రసంగం ద్వారా ఫుల్‌మీల్స్‌ పెడతారని సంబర పడుతున్నారు.. 

400 ఎకరాల్లో ఆవిర్భావ వేడుకలు..

పిఠాపురం నియోజకవర్గంలో విశాలమైన ప్రాంగణం కోసం అన్వేషించారు. చివరకు పిఠాపురంలో నేషనల్‌ హైవేకు ఆనుకుని  ఉన్న సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడే సభా వేదిక, సభా ప్రాంగణంతోపాటు భోజనాలు, ఇతరత్రా ఏర్పాట్లు ఇలా అన్ని విధాలుగా సరిపడే విధంగా ఈ ప్రాంగణం వద్ద చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున భారీగా వాహనాలు వస్తాయని.. వాహనాల పార్కింగ్‌ కోసం అందుకు స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.. 

ఒక్కరోజుకే కుదింపుతో కాస్త నిరుత్సాహం..

అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న జనసేన ప్లీనరీ తొలుత 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తామని పార్టీ కీలక నేతలు ప్రకటించారు. అనూహ్యంగా ఒక్కరోజుకే ప్లీనరీ పరిమితం చేయడంపై జనసేన పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపిస్తోంది. మార్చి 14న జరగబోయే ఈ ప్లీనరీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, విదేశాల్లో స్థిరపడిన వారు సైతం వస్తారని అంచనా వేశారు. అందులోనూ కూటమిగా విజయం సాధించి అధికారం చేపట్టాక డిప్యూటీ  సీఎం పవన్‌ కల్యాణ్‌ పార్టీ ప్లీనరీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఆ సమావేశం రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి మధ్యాహ్నం లంచ్‌, ఆ తరువాత స్నాక్స్‌ వరకు ప్లీనరీకి హాజరయ్యే జనసైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ విందు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: YS Jagan: లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్