AP DCM Pawan Kalyan Tour: తిరుమల తొక్కిసలాట ఘటనపై కచ్చితంగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై తాను క్షమాపణ చెప్పానని... అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. అదే టైంలో టీటీడీ ఛైర్మన్‌, ఈవో కూడా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. 




అంతకు ముందు పిఠాపురంలోని కుమారపురంలో మినీ గోకులాన్ని పవన్ కల్యాణ్ ప్రాంభించారు. శ్రీ కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ.1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి నాలుగు గోవులను రైతుకి అందజేశారు. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా కుమారపురం మినీ గోకులాన్ని ప్రారంభించిన పవన్ గోమాతను పూజించి, పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 




పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. పశువులకు అందిస్తున్న దాణా, అందుబాటులో ఉన్న పశుగ్రాసం వంగడాలు, పశుగణాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వీడియో ద్వారా తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్ పరిశీలించారు. గొల్ల‌ప్రోలులో నూత‌నంగా నిర్మించిన త‌హ‌సీల్దారు కార్యాల‌యం, చేబ్రోలు గ్రామంలో జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌, తాటిప‌ర్తి గ్రామంలో మంచినీటి పైపులైన్ల‌ను, గొల్ల‌ప్రోలు ప‌ట్ట‌ణంలో యుపీహెచ్ సీ భ‌వ‌నం ప్రారంభించారు. 




పిఠాపురంలోనే జ‌న‌సేన ప్లీన‌రీ.. 


జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ప్లీన‌రీ నిర్వ‌హిస్తున్న‌ారు. ఇప్ప‌టికే పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. మార్చి 12, 13, 14 తేదీల‌్లో జరిగే ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రానున్నారు. ప్లీన‌రీ అనువుగా ఉండే విధంగా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ఆదేశించార‌ని పార్టీ నాయకులు చెబుతున్నారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు స్థలాలను పరిశీలించారు. చేబ్రోలులోని ప‌వ‌న్ నివాసం నుంచి చిత్రాడ శివారు ఎస్బీ వెంచ‌ర్స్ వ‌ర‌కూ హైవే ప‌క్క‌ ఉన్న పలు ప్రాంతాల‌ను పరిశీలించారు. వాహ‌నాల రాక‌పోక‌లు, దూర ప్రాంతాల నుంచి వ‌చ్చేవారికి విడిది, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉండేందుకు త‌గిన ఏర్పాట్లు స‌క్ర‌మంగా ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్‌తోపాటు, ప్లీన‌రీ నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జ‌న‌సేన నాయ‌కులు, జ‌న‌సైనికులు ఈ ఏర్పాట్లలో ఉన్నారు.