ఒకప్పటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ఇప్పటి పద్మనాభరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లెటర్ రాశారు. అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా తన ఆవేదనను.. ఆవేశాన్ని, హెచ్చరికలను తెలిపే ఆయన ఈసారి చంద్రబాబుకు ఓ ప్రపోజల్ పెట్టారు. పార్టీలు వేరైనా పాతరోజుల్లాగా కలిసి ఉందామని హుందాగా రాజకీయాలు చేద్దామని ప్రతిపాదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాలు హుందాగా నడిపారని ఇప్పటిలా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదన్నారు. మళ్లీ అప్పటి రాజకీయాలు చేయాలని సూచించారు.
నేనూ మీ మిత్రుడినే
చంద్రబాబు గురువారం కిర్లంపూడి నుంచి తాజాగా లేఖ పంపిన ముద్రగడ తనని తాను చంద్రబాబుకు పాత మిత్రుడనని పరిచయం చేసుకున్నారు. 1999 నుంచి ఐదేళ్ల పాటు చంద్రబాబుతో కలిసి పనిచేశానని అందుకే పాత మిత్రుడంటున్నానని చెప్పుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ధోరణి ఇలా ఉండేది కాదని.. రెడ్ బుక్ రాజ్యాంగం అప్పట్లో అమల్లో లేదని .. పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించలేదనీ చెప్పారు. ఇప్పడు రెడ్ బుక్ పేరుతో ప్రతీ నిమిషం కేసులు పెట్టి వేధించే కార్యక్రమం తీసుకోవడం తనకు బాధగా ఉందన్నారు. “మీ కుమారుడు లోకేష్ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని” చంద్రబాబుకు సలహా ఇచ్చారు.
జగన్ వస్తారు.. విశ్వరూపం చూపిస్తారు.
అమావాస్య తర్వాత పౌర్ణమి.. పౌర్ణమి తర్వాత అమావాస్య ఎలా వస్తాయో అలాగే జగన్ కూడా అధికారంలోకి రావడం ఖాయమని.. ఇప్పుడు చేస్తున్న దానికి ప్రతీకారంగా ఆయన కూడా ఇలాగే నడుచుకుని విశ్వరూపం చూపిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రశాంతంగా ఉన్నా.. దెబ్బతిన్న వారు ఊరుకోరని వాళ్లు కసి, కక్ష తీర్చుకునేందుకు జగన్ పై ఒత్తిడి చేస్తారని కాబట్టి జరిగే ప్రమాదాన్ని గుర్తించి సంయమనం పాటించాలని సూచించారు.
వైఎస్సార్, తాను, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించామన్న ముద్రగడ అప్పటి స్నేహాలు ఎంతుబాగుండేవో అని గుర్తు చేసుకున్నారు.