Pawan Kalyan to visit Pithapuram on July 1 | అమరావతి: సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అదేరోజు (జులై 1న) సాయంత్రం పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు.
కొండగట్టుకు పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు. జూన్ 29వ తేదీన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. నేటి నుంచి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష కొనసాగించనున్నారు.
ప్రజల ఆకాంక్షలను శాసన సభలో ప్రతిఫలింపచేద్దాం.. సభ నియమావళిపై అవగాహన పెంచుకోవాలని, సభా సంప్రదాయాలు గౌరవించాలని జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దన్నారు. శాఖాపరమైన అంశాలను, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ఉక్కు పాదం మోపుదామన్నారు. జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏం చెప్పారో, డిప్యూటీ సీఎం అయిన తరువాత సైతం సరిగ్గా అదే విధంగా కొనసాగుతున్నారు. మంత్రిగా శాఖల బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదీర్థంగా శాఖలపై అధికారులతో సమీక్షలు చేసి విషయాలు తెలుసుకుంటున్నారు. పెండింగ్ విషయాలు తెలుసుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సాధ్యాసాధ్యాలు, గత ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రాలు విడుదలకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు ఫైళ్లపై పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని పాల్గొని పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ నుంచి తిరిగొస్తుంటే తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనిపించగానే కాన్వాయ్ ఆపి, కుర్చీ వేసుకుని మరి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరి సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడటంతో తను మాటల మనిషి కాదని, చేతల నేతగా నిరూపించుకుంటారని ప్రజలు భావిస్తున్నారు.