Swarnandhra Swachchhandhra Sabha | పెద్దాపురం: ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలంటే ప్రజల ఆలోచనా విధానం మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో ఆయన ప్రసంగించారు. ఏపీ రాజధాని అమరావతి మునిగిపోయిందని, వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని.. తమది విజనరీ పాలిటిక్స్ అయితే, వైసీపీది ప్రిజనరీ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు.
పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి‘వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను విధించింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా, దాన్ని తొలగించే చర్యలు మాత్రం తీసుకోలేదు. ప్రజల ఆరోగ్యం పట్ల గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారు. కానీ మా ప్రభుత్వం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్త రహితంగా మార్చుతుంది. పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలో నిర్మిస్తాం. ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వారి బాధ్యతగా భావించాలి. అపరిశుభ్రతే అనారోగ్యానికి మూల కారణం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కల్లోలం సృష్టించినా, కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమం - అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది. ప్రజల ఆదాయం పెరిగి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడం మా ఆశయం. చెత్తను కూడా ఆదాయవనరుగా మార్చే దిశగా ఆలోచిస్తున్నాం. ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపాలని చూస్తున్నాం. రాష్ట్రంలోని పేదల ఆరోగ్య రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేదరిక నిర్మూలన చాలా అవసరం. కానీ వైసీపీ మాత్రం అభివృద్ధి చేయకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. పెద్దాపురం నియోజకవర్గంలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. గత ఎన్నికల సమయంలో పింఛన్ (AP Pensions) పేరుతో వృద్ధులను ఎండల్లో తిరిగేలా చేసి ప్రాణాలు తీస్తే, ఇప్పుడు కూటమి పాలనతో వాలంటీర్స్ లేకపోయినా ఇంటికే వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రంలో భూతం మళ్లీ వచ్చిందని భయపెడుతున్నారు. తమ వైసీపీ కార్యకర్తల ప్రాణం పోయినా పార్టీ నేతలే పట్టించుకోరు. మార్ఫింగ్ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేశారు.
వర్షాలు కురిస్తే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయడంతో పాటు నిధులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖలు రాశారు. కానీ మేము అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతిని మహానగరాలుగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాం. వైసీపీ హయాంలో అవయవలోపాలు లేకున్న వ్యక్తులకు సైతం దివ్యాంగుల పింఛన్లు ఇచ్చారు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందాలి. వారి విషయంలో రాజకీయాలు తగదు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వారు చేసే విషప్రచారం సరికాదు. మన రాజకీయాలు విజన్ తో ఉంటాయి, వారి రాజకీయాలు మాత్రం క్రిమినల్ మైండ్‌సెట్‌తో ఉంటాయని” చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘సూపర్ సిక్స్’ గ్రాండ్ సక్సెస్“సంపదను పెంచడం, ప్రజల ఆదాయాన్ని పెంచడం ఎలాగో మాకు తెలుసు. అప్పుల మీద ఆధారపడి చేసే సంక్షేమం నిలకడగా ఉండదు. ఒకప్పుడు ‘సూపర్ సిక్స్ (Super Six) సాధ్యం కాదు అని వైసీపీ ప్రచారం చేసింది. కానీ మేము చేసి చూపించాం. అది ప్రజల మద్దతుతోనే సూపర్ హిట్ అయింది. అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోంది. రాష్ట్రంలో 40 వేల హెయిర్ కటింగ్ షాపులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం, దాంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పీ-4 పథకం ద్వారా ఇప్పుడు పేదలను ఆదుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు ఆలోచిస్తోంది. దీపావళి నుంచి జీఎస్టీ స్లాబ్స్ ద్వారా ప్రయోజనం కలగనుంది” అని చంద్రబాబు వివరించారు.