Kakinada Rural News : కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మీడియా సమావేశంలో ఆయన లేవనెత్తిన పలు అంశాలు చర్చకు దారితీశాయి. టీడీపీ నాయకులకు ప్రధాన్యతనివ్వడం లేదని ఆయన ఆవేదన వెళ్లగక్కారు. అయితే కాకినాడ జిల్లాలోని కూటమిలో కుంపటి నివురు గప్పిన నిప్పులా రాజుకుంటుందని చర్చ సాగుతోంది.
ఇప్పటికే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోను ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆరోపించటంపై కాకినాడ జిల్లాలో కూటమి ఐక్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు... రెండు సార్లు ఎమ్మెల్యేగా ... కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీకు అత్యంత విశ్వసనీయమైన దంపతులుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తికి పేరు ఉంది. ఎమ్మెల్యేగా అనంతలక్ష్మి ఉన్నప్పటికీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఆమె భర్త సత్యనారాయణమూర్తి వ్యవహరిస్తుంటారు.1999 అప్పటి సంపర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి అనంతలక్ష్మి గెలిచారు. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన తరువాత కాకినాడ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఈ దంపతులు టీడీపీకు అత్యంత విశ్వసనీయమైన నాయకులుగా గుర్తింపు పొందారు.. ఆ తరువాత 2014లో టీడీపీ తరపున కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుపై పోటీచేసి 9 వేలకుపైగా మెజార్టీ పొంది విజయం సాధించారు. 2019లో కూడా పిల్లి అనంతలక్ష్మికే ప్రాధాన్యత ఇచ్చి కాకినాడ రూరల్ టీడీపీ సేటు ఇచ్చి పోటీలో దింపింది. అయితే మాజీ మంత్రి కురసాల కన్నబాబు విజయం సాధించారు..
2024లో తీవ్ర అసంతృప్తి మధ్య అంగీకారం.. ఆ తరువాత కాకినాడ రూరల్ నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా కీలక బాధ్యతలు స్వీకరించిన పిల్లి దంపతులకు 2024లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురయ్యింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీక కేటాయించడంతో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తిల అనుచరులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాకినాడలోని వీరి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. అధిష్టానం పిలుపుతో ఉన్నఫళంగా అమరావతి వెళ్లిన దంపతులు చివరకు బుజ్జగింపుతో వెనక్కి తగ్గి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలుపునకు పనిచేశారు... అసంతృప్తితోనే రాజీనామా.. కాకినాడ రూరల్ టీడీపీ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలిసి పిల్లి సత్యనారాయణమూర్తి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో పార్టీ విఫలమైందని జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పథకాలలో టీడీపీకి ఇవ్వవలసిన 50శాతం వాటాను ఇవ్వకుండా చేస్తున్నారని దానివల్ల కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నాననే మనస్థాపనతో టీడీపీ ఇచ్చిన కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.. గడిచిన 14 నెలలలో గెలిచిన ఎమ్మెల్యే నానాజీ కనీసం తమ వంక కూడా చూడకపోగా టీడీపీ కార్యకర్తలను, నాయకులను కానీ పట్టించుకునే పరిస్థితి కూడా లేదని పిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నానే బాధతో రూరల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
నియోజకవర్గ అబ్జర్వర్‌గా ఉన్న రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఏకపక్ష నిర్ణయాలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కోకో ఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి సత్య ప్రభాకర్ (బాబీ) రూరల్ నియోజకవర్గం పార్టీలో విభేదాలు తీసుకొచ్చారని అన్నారు. తనను రాజకీయంగా ఎదగడానికి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తప్పుడు రాజకీయాలను నిలువరించవలసిన స్థానంలో ఉన్న అబ్జర్వర్ కుడిపూడి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పిల్లి ఆరోపించారు. తాను 40 ఏళ్ల క్రితం పార్టీలో చేరానని నేటికీ అదే పార్టీలో ఉన్నానని చెప్పారు. తాను చనిపోయిన తర్వాత కూడా టీడీపీ జెండా తనపై కప్పి శ్మశానానికి తీసుకెళ్లడమే తన చివరి కోరికని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్మ బుజ్జగింపుతో వెనక్కు తగ్గుతారా...
పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా వ్యవహారంపై టిడిపి అధిష్టానం దృష్టి సారించింది.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిల్లి సత్యనారాయణ, అనంత లక్ష్మీ దంపతులను కలిసి చర్చించారు.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు..