రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు లభించిన రిజర్వేషన్లును మత మార్పిడి పొందిన ఎస్సీలకు కూడా ఇవ్వాలని తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు (AP BJP Chief Somu Veerraju) సోము వీర్రాజు విమర్శించారు. రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును తప్పుపట్టారు. ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోకుంటే దీనిని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో తీర్మాణం చేసింది. బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లా ?
మత మార్పిడిలు పొందిన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్ధమని వీర్రాజు అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తీర్మాణించడం జరిగిందని, దీనిపై అప్పట్లో కూడా భారతీయ జనతాపార్టీ (BJP) ఉద్యమం చేయడం జరిగిందని, గవర్నర్‌ను సమయం అడిగామని, 27న కలవడానికి ప్రయత్నంచేస్తామని వెల్లడించారు. ఈ ఉద్యమం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. కేవలం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్లనే ఈ అత్యవసర సమావేశం నిర్వహించామని, మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో తీర్మానిస్తూ ప్రకటించిన సీఎం జగన్..
నా రాజకీయ ప్రయాణం మొదలయ్యాక ఎస్టీలు నన్ను ఎలా గుండెల్లో పెట్టుకున్నారో, నేను వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటాను. వారికి అన్యాయం జరగకుండా చూస్తామని శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలానే తీర్మానం చేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుంది.
ఒక దళితుడు ఇది వరకు తాను ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరొక మతంలోకి వెళ్తే వారి సాంఘిక, ఆర్థిక, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రావు. మతం అనేది ఆ మనిషికి ఆ దేవుడికి మధ్య ఉన్న సంబంధం అన్నారు. మతం మార్పిడితో ఏం నష్టం జరగదని తెలుసు. అందుకే క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని కొరుతూ తీర్మానాలు చేస్తూ కేంద్రానికి పంపిస్తున్నాం. అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం చేయాలనేది నా ప్రయత్నం. వాయిస్ లెస్ పీపుల్ కు వాయిస్ అవ్వాలని నిర్ణయించుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు..
క్రైస్తవ వర్గాల హర్షాతిరేకాలు...
అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేయడంపై దళిత క్రైస్తవ నాయకులు హర్ష వ్యక్తం చేశారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో సమావేశమైన పలువురు దళిత క్రైస్తవ నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికైనా తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుందని, ఎన్నో ఏళ్లుగా దళిత క్రైస్తవులు అనేక అవకాశాలు కోల్పోతున్నారని, అట్రాసిటీ కేసుల్లో కూడా బాధితులు ఎస్సీలు కాదని నిందితులు ఆరోపిస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, ఇది వారికి ఒక అస్త్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.