Annavaram Temple News: అన్నవరం ప్రసాదం ఉంచిన బుట్టలపై ఎలుకలు తిరుగుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న వేళ అధికారులు స్పందించారు. దీనికి కారణమైన అధికారులను సస్పెండ్ చేశారు. 

Continues below advertisement

అన్నవరం ప్రసాదం చాలా పవిత్రమైంది. చిటికెడు దొరికితే చాలు అది మహా అద్భుతమని కళ్లకు అద్దుకుని తినే వాళ్లు కోట్ల మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రసాదం తయారీ, పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ సరి చేసుకోకపోగా భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో అన్నవరం ప్రసాదం ఉన్న బుట్టల్లో ఎలుకలు తిరుగుతన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కళ్లకు కట్టినట్టు తప్పు కనిపిస్తున్నా దాన్ని పట్టించుకోకుండా భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే ఉంటుందని తింటే తినండి లేకుంటే వెళ్లిపోండని మండిపడ్డారు. ఇవన్నీ కూడా వీడియోలో రికార్డు అయ్యాయి.

Continues below advertisement

ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జరిగిన తప్పిదాన్ని గ్రహించిన అన్నవరం దేవస్థాన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, తమ విధులకు న్యాయం చేయని వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఈవో ఆదేశించారు. 

ఇప్పడే కాకుండా గతంలో కూడా అన్నవరం సిబ్బందిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని చర్యలు తీసుకున్నా అన్నవరంలో సిబ్బంది తీరు మారడం లేదని భక్తులు అంటున్నారు. సేవల విషయంలో నిర్లక్ష్యం వీడటం లేదని ఆరోపిస్తున్నారు.