Pawan Counter to YS Jagan: మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తీసుకున్న వారిని జైల్లోకి పంపిస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని పెరవలిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌ అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడే అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశం 7,910 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  

Continues below advertisement

అమరజీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన వచ్చిన విమర్శలు ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఎన్నో కష్టాలు ఎదురుదెబ్బలు తిని పార్టీని పదేళ్లుగా నడుపుతూ వచ్చానని అన్నారు. ప్రజల కోసం చాలా తగ్గినట్టు చెప్పారు. దీన్ని అర్థం చేసుకోలేని వాళ్లు తాను టికెట్లు అమ్ముకున్నట్టు, డబ్బులకు లొంగిపోయినట్టు విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడంటే, దేశమంటే, ప్రజలంటే ఎంత పిచ్చి ఉండాలని అన్నారు. అలాంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డారు. 

ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చినా కొందరికి బుద్ది రాలేదని పవన్ ఫైర్ అయ్యారు. ఇంకా రాష్ట్రంలో రౌడీయిజం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇలాంటి వాటి ఆట కట్టించేందుకు తమకు రెండు రోజుల సమయం చాలని అన్నారు. ఇలాంటి వారికి సీఎం యోగీ ఇచ్చే ట్రీట్మెంట్‌ ఇస్తే సెట్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో చిన్ని పిల్లలను కూడా చూపించి కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇంకా బరితెగించి జైల్లో పెడతామంటూ కాంట్రాక్టర్‌లను ఇతరులను బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే తమను ఏం పీకలేకపోయారని ఇకపై ఏం చేస్తారని అన్నారు. తాను ఎప్పుడు బయటకు వచ్చినా ఇంటికి వెళ్తానో లేదో అనే ఆలోచనతో ఉంటానని ప్రకటించారు. అందుకే తనకు భయం లేదని పేర్కొన్నారు.  

Continues below advertisement

ఎన్ని విమర్శలైనా ఎదుర్కొనేందుకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని పవన్ తెలిపారు. కానీ ప్రతి దానకి ఓ లిమిట్ ఉంటుందని, అలాంటి వారికి గట్టి ట్రీట్మెంట్ ఇస్తామని తెలిపారు. అడ్డగోలుగా ఏది పడితే అది చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు.  

తాజాగా ప్రారంభించిన అమరజీవి జలధార ఐదు జిల్లాల ప్రజలకు మేలు చేస్తుందన్నారు పవన్ కల్యాణ. దాదాపు కోటీన్నర మంది దాహాన్ని తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.