CPI Ramakrishna On Jagan: రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్ధ ముఖ్యమంత్రి మరొకరు లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పిన సీఎం.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. 


నిర్వాసితులను పట్టించుకున్నారా


ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రామకృష్ణ విమర్శానాస్త్రాలు సంధించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టులు మార్చి ఏం సాధించారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం భూములిచ్చి నిర్వాసితులైన వారిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులు ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారని బాధపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితులకు పదివేలు ఇస్తే.. మీరు 2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. 


ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు


విభజన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి.. వారితో లాలూచీ పడి ప్రత్యేక హోదా హామీలను తుంగలో తొక్కారని రామకృష్ణ ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ వాదాన్ని సీఎం జగన్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేనివారు.. ఇంకా 3 రాజధానులు ఏం కడతారని ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న యాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని వైయస్సార్ వర్సిటీగా పేరు మార్చడం తగదన్నారు. రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది కదా అని ఎలా పడితే అలా పాలన చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 


అక్టోబర్ 14 నుంచి 18 వరకు సీపీఐ మహాసభలు


విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడం కోసం అవసరమైతే దిల్లీలో మరోసారి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని సీపీఐ రామకృష్ణ అన్నారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు జరుగుతాయని తెలిపారు. దీనికి అన్ని వర్గాల ప్రజల ఆదరణ కావాలని కోరారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కలిసివచ్చే వారిని కలుపుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని రామకృష్ణ స్పష్టంచేశారు. మహాసభలకు భాజపా తప్ప అన్ని పార్టీలకు ఆహ్వానం ఉందని చెప్పారు. 


అందుకే వర్శిటీ పేరు మార్పు: జగన్
‘‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు రూపొందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 8 మెడికల్ కాలేజీలు టీడీపీ పుట్టకముందే, 1983 కన్నా ముందే స్థాపితం అయ్యాయి. మిగతా 3 మెడికల్ కాలేజీలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారు. ఇప్పుడు నా హాయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. మొత్తంగా 27 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్ఆర్ వల్లనో, ఆయన కొడుకు అయిన నా వల్లనో ఏర్పాటు అవుతున్నాయి. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హాయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేదు.’’ అని సీఎం జగన్ అన్నారు.


అలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్లు వాళ్లకి కావాల్సిన పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో 20 కి పైగా మెడికల్ కాలేజీలు నెలకొల్పేందుకు కారణమైన వైఎస్ఆర్ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టడంలో తప్పేముందని సీఎం జగన్ ప్రశ్నించారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తికి, క్రెడిట్ ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్ విషయంలో తనకు ఎలాంటి కల్మషం లేదని సీఎం జగన్ చెప్పారు.