కాకినాడ జిల్లా తునిలో దారుణం జరిగింది. భవానీ మాలలో వచ్చిన దుండగుడు ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఆయన ఓ రాజకీయ నాయకుడు కావడం ఇప్పుడు కాకినాడలో తీవ్ర సంచలనంగా మారింది. 


తునిలో టీడీపీ లీడర్‌ మాజీ ఎంపీపీ శేషగిరిరావుపై హత్యాయత్నం కాకినాడలో చర్చనీయాంశంగా మారింది. భవానీ మాలలో వచ్చిన దుండగుడు శేషగిరిరావుపై అటాక్ చేశాడు. భిక్ష తీసుకుంటున్నట్టు నటించి ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. చేతిలో ఉన్న కత్తిని కనిపించకుండా తన వస్త్రాలతో కప్పి శేషగిరిరావు భిక్ష వేస్తున్న టైంలో దాడి చేశాడు. 






ఊహించని దాడిలో శేషగిరిరావు చేతికి, తలపై గాయలయ్యాయి. వెంటనే తేరుకొని ఇంట్లోకి పరుగెత్తారు. శేషగిరిరావు గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే తెచ్చి పెట్టుకున్న బైక్‌లో పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ కూడా శేషగిరిరావు ఇంటికి ఉన్న సీటీటీవీల్లో రికార్డు అయ్యాయి. 


 గాయపడి రక్తంలో పడి పోయిన శేషగిరిరావును ఫ్యామిలీ మెంబర్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కాకినాడలో అపోలో ఆస్పత్రిలో శేషగిరిరావుకు చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా  దర్యాప్తు చేస్తున్నారు. 


దాడి విషయం తెలుసుకున్న పార్టీ నేతలు శేషగిరిరావును పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప ఇతర నేతలు ఆయన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ లీడర్లు డిమాండ్‌ చేశారు.