Janasena Rebel MLA Rapaka Varaprasada Rao: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (రాజోలు): ఓవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు.. చంద్రబాబు, జనసేన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దంటూ ఎమ్మెల్యే రాపాక హితవు పలికారు. ఆక్వా రైతుల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు పైన, జగనన్న కాలనీలు పై జనసేన చేస్తున్న రాద్దాంతాలపై రాపాక తప్పు పట్టారు.
ఆక్వా రైతులను గత టీడీపీ ప్రభుత్వమే మోసం చేసింది
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని.. వీలైతే ప్రజలకు సహాయం చేయాలని టీడీపీ, జనసేన పార్టీ అధ్యక్షులకు హితవు పలికారు. ఆక్వా రైతులను గత టీడీపీ ప్రభుత్వమే మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద కౌంటుకి 310, 320 ధర ఉండగా దాన్ని 180 కి తగ్గించిన పాపం మీదే అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. సీడ్, ఫీడ్ మొత్తం మీ సామాజిక, రాజకీయ వర్గాలకి చెందిన కంపెనీలే అయినందున ఆక్వా రైతులను నిండా ముంచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆక్వా రైతులకు అండగా జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడి రూ. 1.50 కే విద్యుత్ రాయితీ, మద్దతు ధర ప్రకటించి ఆక్వా రైతులను ప్రోత్సాహిస్తున్న విషయం గుర్తెరగాలన్నారు. అలాగే జగనన్న కాలనీలపై జనసేన చేపట్టిన కార్యక్రమంపై స్పందిస్తూ ఈ పద్దతి సరైంది కాదని పరోక్షంగా జనసేన పై విమర్శలు చేశారు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకోవాలని, ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టించవద్దని ఇరు పార్టీలపై చురకలు వేశారు. అనంతరం సఖినేటిపల్లి లంక గ్రామంలో గడప గడపకు తిరిగి జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీఎం జగన్ ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో బిజీబిజీగా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక హబ్ అయి ఉండేదని.. నిరుద్యోగం అనే మాటే ఉండేది కాదని చంద్రబాబు కర్నూలులో వ్యాఖ్యానించారు. కర్నూలు పర్యటనకు వెళ్లిన ఆయనకు ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు కూడా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వచ్చారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇబ్బందులను విద్యార్థులు చెప్పుకున్నారు. ‘జాబు రావాలి అంటే.. బాబు రావాలి’ అంటూ నినాదాలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని చంద్రబాబు విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు.