Amalapuram Violence: కోనసీమ:  గత నెలలో అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో మరో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 129 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు డీఐజీ పాలరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో గత నెలలో అక్కడ నిలిపివేసిన ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించారు. గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ అవుతాయని వెల్లడించారు. అల్లర్ల కేసులో చాలావరకు పురోగతి సాధించామని పోలీసులు చెబుతున్నారు.



13 రోజులుగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు...!
జిల్లా పేరు మార్పుతో అల్లర్లు మొదలై అది పూర్తిగా హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలయిన అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం మండలాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. పలు చోట్ల 144 సెక్షన్ విధించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూశారు. పరిస్థితి అదుపులోకి రావాలంటే సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అవకూడదని భావించిన ప్రభుత్వం, పోలీసు విభాగం ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. ప్రతిసారి 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలు బంద్ అంటూ ప్రకటన విడుదల చేశారు. తాజాగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో ఇంటర్నెట్ సేవలు (Internet Service Revoked in Konaseema) పునరుద్ధరించారు.


అసలేం జరిగింది?
కోనసీమ జిల్లా పేరు బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై గత నెలలో మామూలుగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. కలెక్టరేట్‌ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది. 


Also Read: Viswaroop Son Krishna Reddy : రెండేళ్లలో అందరి అంతు చూస్తా - అమలాపురంలో మంత్రి కుమారుడి రివెంజ్ 


Also Read: MLA Kodali Nani on Ambedkar : చంద్రబాబే అంబేడ్కర్ పేరు పెట్టాలని సూచించారు