డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యువకుని హత్యతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గురువారం రాత్రి స్థానిక ఈదరపల్లి స్మశాన వాటిక వద్ద ఉన్న ఇద్దరిపై గుర్తుతెలియన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈదరపల్లి ప్రాంతానికి చెందిన పోలిశెట్టి కిషోర్‌ అనే యువకుడు మృతిచెందాడు. తీవ్ర గాయాలుపాలైన మరో యువకుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 


ఆ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్‌బాడీని పోస్ట్‌మార్టానికి పంపించి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియన వ్యక్తుల దాడిలో మృతి చెందిన కిషోర్‌, గాయపడ్డ యువకుడు అమలాపురంలోని ఓ పాత రౌడీషీటర్‌ వర్గీయులు. అదే గ్రామంలోనే ఉండే ప్రత్యర్థి వర్గానికి చెందిన  అనుచరులతో వీళ్లకు గొడవ జరిగిందని ప్రచారంలో ఉంది. హత్యకు ఆ గొడవే కారణమని ప్రచారం జరగింది. దీంతో అమలాపురంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 


శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక ఎర్రవంతెన వద్దనున్న ఓ రౌడీ షీటర్‌కు చెందిన ఆఫీస్‌ను, ఏర్పాటు చేసిన అతని కటౌట్‌ను గుర్తుతెలియన వ్యక్తులు దహనం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దగ్ధం అయిన రౌడీషీటరుకు చెందిన ఆఫీస్‌ను అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్‌ పరిశీలించారు. పట్టణంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 


ఈ రెండు ఘటనలపైనా దర్యాప్తు చేస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. అమలాపురం అల్లర్ల సంఘటన తరువాత ప్రశాంతగా ఉన్న ప్రాంతంలో హత్యలు కలకలం రేపాయి. రౌడీ షీటరు అనుచరుడైన యువకుని హత్య.. ఆ తరువాత మరో రౌడీషీటరుకు చెందిన ఆఫీస్‌ దగ్ధం ఆధిపత్యపోరు తెరపైకి వచ్చింది. 


ఎటువంటి రాజకీయ కోణం లేదు: డీఎస్పీ 


అమలాపురంలో జరిగిన యువకుని హత్య, ఎర్ర వంతెన వద్దనున్న ఆఫీసు దహనంలో రాజకీయ కారణం లేదని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తెలిపారు. గురువారం రాత్రి ఈదరపల్లి శ్మశాన వాటిక వద్ద మద్యం సేవిస్తుండగా కొందరు బైక్‌లపై వచ్చి దాడికి చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో పోలిశెట్టి కిషోర్‌ మృతి చెందాడని, అడపా సాయి లక్షణ్‌ గాయాలపాలయ్యాడని పేర్కొన్నారు. సాయిలక్ష్మణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేశామని, హత్యకుపాల్పడ్డ వారిని గుర్తించి వారికోసం గాలిస్తున్నామన్నారు. 


ఇంతలోనే ఎర్రవంతెన వద్దనున్న ఓ షాపుపై ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి దహనం చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనల్లో ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. ఈ ఘటనల్లో ఎంతటి వారు ఉన్నా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అందరూ సమయమనం పాటించాలని సూచించారు.