Rajahmundry Rain News: రాజమండ్రి నగరంలో కురిసిన చిన్నపాటి వర్షానికి వీధులు, రోడ్లన్ని నీట మునిగాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ ల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం నగరంలోని వీధులన్నీ వాటర్ స్ట్రీట్లను తలపించాయని అన్నారు. మంగళవారం (మే 7) కురిసిన వర్షం కారణంగా నగరంలో నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాలను టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. తుమ్మలోవలో చేరిన ఆ వర్షపు నీటిలోనే ఆయన నడుచుకుంటూ వెళ్లి స్థానిక ప్రజలను పరామర్శించడం జరిగింది. 


ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అనాలోచితంగా ఎటువంటి ప్రణాళికలు లేకుండా నగరంలో చేపట్టిన పనుల కారణంగా చిన్నపాటి వర్షానికి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నేను చేసిందంతా అభివృద్ధి అంటూ మార్గాని భరత్ రామ్ ప్రచారం చేస్తున్నాడని.. అభివృద్ధి అంటే ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. అధికార దూరహంకారంతో ఎలాంటి చర్చలు లేకుండా చేపట్టిన పనుల కారణంగా ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని అన్నారు. చేపట్టిన పనులన్నీ నీటిపాలు అయ్యాయి చూశావా భరత్ అంటూ నిలదీశారు. ఇప్పుడు వీధుల్లోకి వెళ్లి ఇది నేను చేసిన అభివృద్ధి చెప్పగలవా భరత్ రామ్ అంటూ మండిపడ్డారు. ఏమైనా పనులు చేసే ముందు వాటి లోటుపాట్లు గురించి ఆలోచనలు చేసి చేపట్టాలని సూచించారు.


నగరంలో భరత్ రామ్ చేపట్టిన పనులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఒకవైపు ఫుట్ పాత్ లు, రోడ్ల మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి వర్షపు నీరు పోయేందుకు ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అవి లేకపోవడం వల్ల వర్షపు నీరు గంటల తరబడి అలాగే నిలిచిపోయిందని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాలన్నింటినీ గమనించారని ప్రజలను కోరారు. ఏది ఏమైనా త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో జరిగిన పనులు అన్నింటిపై విచారణ చేపట్టి అవినీతి జరిగిందని నిరూపితమైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు.