Nara Rohith unveils status of SR NTR | ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సందడి చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తోన్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రామచంద్రపురం ఆయన విచ్చేశారు.. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు..
తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్..
తెలుగువారంతా తమ ఆత్మగౌరవంగా భావించే నందమూరి తారకరామారావు ఎన్నో ప్రజారంజక సంక్షేమ పథకాలకు ఆద్యుడుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచిపోయారని ప్రముఖ సినీ హీరో, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు నారా రోహిత్ అన్నారు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి నారా రోహిత్ ఆవిష్కరించారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డు సెంటర్లో పసలపూడి వద్ద తెలుగుదేశం నాయకుడు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, మంత్రి సుభాష్ తండ్రి అయిన వాసంశెట్టి సత్యం సుమారు రూ. తొమ్మిది లక్షలు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప ప్రజానాయకుడు ఎన్టీఆర్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ను అధికారంలోకి తీసుకువచ్చి తన సుపరిపాలనలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని సినీ హీరో నారా రోహిత్ కొనియాడారు. ఆవిష్కరణ అనంతరం నారా రోహిత్ పార్టీ నాయకుల నుద్దేశించి మాట్లాడుతూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలు దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారన్నారు. రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తనను ఆహ్వనించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు..
రాజకీయ రికార్డులు ఎన్టీఆర్‌కే సొంతం..
తెలుగుదేశం పార్టీను స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, రాజకీయ రికార్డులు సృష్టించడం కేవలం ఎన్టీఆర్‌కే సాధ్యం అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా, అన్ని రకాల పాత్రలు పోషించిన మహానటుడుగా కీర్తింపబడ్డారన్ కిలో రెండు రూపాయలు పధకం, పేదలకు పింఛన్ వంటి పధకాలను ప్రవేశ పెట్టి రాష్ట్ర పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, గంధం పల్లంరాజు, కూటమి పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం నారా రోహిత్ ను, మంత్రి సుభాష్ ను, శిల్పి వడయార్ ను కూటమి నాయకులు సత్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.