జిల్లాలో పునర్విభజనలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. కరవుతో ఉండే రాయలసీమకు తొలిసారిగా సముద్రం వస్తే.. ఇప్పుడు ఓ గ్రామం రెండు జిల్లాలుగా విడిపోయింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. 


ఆ గ్రామం ఇప్పుడు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రెండుగా విడిపోయి రెండు జిల్లాల్లోకి వెళ్లిపోయింది. రెండు జిల్లాల సరిహద్దు ఒక సీసీ రోడ్డు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు ఏదో ఒక జిల్లాలో కలపాలని .. దగ్గరగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో అయితే మరీ మంచిదని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు . 


జిల్లాల విభజన అస్పష్టంగా చేశారని...శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండపేట మండలం చినద్వారపూడి వాసులు. ఓ వైపు కొత్త జిల్లాల ఏర్పాటై ఆయా జిల్లా ప్రజలు సంబరాలు చేస్తుంటే... వీళ్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మండపేట నియోజకవర్గంలోని మండపేట మండలం చిన ద్వారపూడిని తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఉంచాలని ఆ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఒకే గ్రామం రెండు జిల్లాలో ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. భూములు, ఇళ్లు, స్కూల్స్ ఇలా చాలా విషయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. 


మండపేట మండలం చినద్వారపూడి ప్రజలు రెండు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లి తమ పరిస్థితి అగమ్య  గోచరంగా మారిందని కనికరించాలని వేడుకున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్డుకు ఒకవైపు ఉన్న వీధి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోకి వెళ్ళింది. మరోవైపు వీధి మండపేట మండలంలో ఉండి కోనసీమ జిల్లాలో కలిసింది.


చినద్వారపూడి వాసులు మాత్రం కోనసీమ జిల్లా ఉండలేమంటున్నారు. ప్రజలు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరిలో ఉన్న వీధి జనం కూడా వీరికి మద్దతుగా నిలిచారు. అధికార, ప్రతిపక్ష నేతలు అసమర్థత వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. 


జిల్లాల పునర్విభజన అస్పష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనపర్తి, బిక్కవోలు మండలాలను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉంచారు. అనపర్తి దాటి ద్వారపూడి, కేశవరం కోనసీమలో ఉన్నాయి. వేరే జిల్లా హద్దులు దాటితే కానీ జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి అనపర్తి, బిక్కవోలు మండలాల వారిది.


సొంత బంధువులే వేర్వేరు జిల్లాలోకి..
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో చినద్వారపుడి గ్రామంలోని బంధువులు, ఒకే కుటుంబానికి చెందిన కుటుంబీకులు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లడంతో అసహనానికి గురవుతున్నారు.  రోడ్డుకి అవతల వైపున ఇల్లు ఉన్న సొంత బావ తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్తే.. రోడ్డుకి ఇవతల వైపున  ఉన్న అతని బావమరిది ఇల్లు కోనసీమ జిల్లాలోకి వెళ్లడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. స్పందించి తమకు దగ్గరలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని కోనసీమ జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.