ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో విద్యుత్ ఛార్జీల పెంపు, కోతలపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. నిర్ణయం వెల్లడైనప్పటి నుంచి ఒక్కొక్కరు ఒక్కో తీరున ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ(TDP) మరో అడుగు ముందుకేసింది.
విద్యుత్ ఛార్జీల పెంపు, కోతలపై నిరసనలకు టీడీపీ లీడర్లు తమ క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు. ఫ్యాన్స్, బల్బ్స్ తీసుకొని విసనకర్రలు, లాంతర్లు ఇస్తామంటూ ప్రచారం చేశారు. వీధి వీధిలో తోపుడు బండిపై వాటిని తిప్పుతూ అమ్మడం మొదలు పెట్టారు.
నరసింహ ప్రసాద్ చేసిన ఆందోళన సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంది. నెటిజన్లు, టీడీపీ నేతలు దాన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. తనకున్న నటనాచాతుర్యంతో ఆ వెరైటీ నిరసనను రక్తికట్టించారాయన.
సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రాహావేశాలను కూడా టీడీపీ లీడర్లు వాడేస్తున్నారు. అందులో జగన్ అభిమానుల కామెంట్స్ ఉంటే చాలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి చేసిన కామెంట్స్‌ను టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్ మోహన్ రెడ్డి బాదుడే బాదుడుకు సొంత పార్టీ అభిమానులే తట్టుకోలేకపోతున్నారని కామెంట్ రాశారు. అందులో ఉన్న వ్యక్తి ఏ చెప్పాడంటే... తాను జగన్ అభిమానిని అని... తన గుండెలపై వైఎస్‌ఆర్‌ఆని ఉందన్నాడు. ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయ నేతలను అభిమానించానన్నారు. చివరకు తనకు ఏమీ మిగల్లేదని.. పింఛన్ ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతీగతి లేదన్నాడు. తాను రోడ్లపై వ్యాపారు చేస్తుంటానని.. బేరాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. తినడానికి కనీసం బియ్యం కూడా లేకుండాపోయాయని.. పేదవాడు కరెంట్ బిల్లు ఎలా కడతాడని ప్రశ్నించాడు. చివర్లో జై టీడీపీ అని ముగించడంతో దీన్ని టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.
నీ బాదుడే బాదుడని భరించలేక నీ పార్టీ అభిమానులు, కార్యకర్తలే ఏమంటున్నారో చూడు వైఎస్ జగన్ అంటూ తెలుగు మహిలా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్వీట్ చేశారు. మీకు కౌంట్ డౌన్ మొదలైందని రాసుకొచ్చారామె.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ వీడియోను రీ ట్వీట్ చేశారు. ఓటేసే ముందు ఆలోచించి ఉండాల్సిందని.. నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారాయన.
ఇలా చాలా మంది టీడీపీ అభిమానులు, సానుభూతి పరులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా మంది అభిప్రాయం ఇలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.