Rajampet Mla Posters : అధికార వైసీపీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి 'మా నమ్మకం నువ్వే జగన్' సిక్కర్లు అతికిస్తుంది. అయితే స్టిక్కర్లు అతికించేందుకు వెళ్లున్న వైసీపీ నేతలకు మాత్రం కొన్ని చోట్ల విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఘటనే రాజంపేటలో వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యేపై స్థానికంగా పోస్టర్లు వెలిశాయి. మా నమ్మకం నువ్వే జగనన్న కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై మాకు నమ్మకం లేదంటూ పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానిక వైసీపీ  నాయకులు, కార్యకర్తలే ఈ పోస్టర్లు వేయించారని జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఇలా పోస్టర్లు వేయించారని స్థానికులు అంటున్నారు. కొద్ది రోజులుగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిపై అసమ్మతి వర్గం గుర్రుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని కొందరు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరుగుతుండటంతో ఇలా పోస్టర్లతో ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజేశారని తెలుస్తోంది. ఈ పోస్టర్ల వ్యవహారం రాజంపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


ఏపీలో స్టిక్కర్ల రాజకీయం 


ఆంధ్రప్రదేశ్ లో 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం కొనసాగుతోంది. వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి మెగా ప్రజా సర్వే చేస్తున్నారు. ఇళ్లకు సీఎం జగన్  స్టిక్లర్లు అంటిస్తున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అయితే మా నమ్మకం నువ్వే జగన్ అంటూ సాగుతున్న కార్యక్రమంలో అక్కడక్కడా అసమ్మతి ఎదురవుతుంది. కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నిస్తుంటే మరికొన్ని చోట్ల వైసీపీ నేతలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు పోస్టర్లు పెడుతున్నారు.  సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ది పాలనకు సంబంధించి ప్రజల స్పందనలను నమోదు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటి వరకు జగనన్నకు మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు 15 లక్షల పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలియ చేస్తూ ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లినపుడు వారి అనుమతితో జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ కూడా అంటిస్తున్నారు. నచ్చితే స్టిక్కర్ గోడకు అంటించుకోవచ్చు. అదే విధంగా సెల్ ఫోన్ పై కూడా అంటించే స్టిక్కర్ లను పంపిణి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సర్వే కార్యక్రమంపై రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. కోటి 60 లక్షల ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రజల అభిప్రాయం తీసుకునే పనిలో ఉన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలు. 


జగన్ స్టిక్కర్లకు ప్రతిపక్షాల కౌంటర్...


అధికార పార్టీకి చెందిన నాయకులు స్టిక్కర్‌ల పంపిణికి ప్రతిపక్షాలు కూడా కౌంటర్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. మా ఖర్మ నువ్వే జగన్...మా కొద్దు జగన్ అంటూ పోటీ స్టిక్కర్‌లను కూడా పంపిణి చేస్తున్నాయి. జగన్ కు సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ ఉన్నా.. దానికి పక్కనే ప్రతిపక్ష పార్టీకి చెందిన స్టిక్కర్‌ను వేసేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కౌంటర్ స్టిక్కర్‌లు వేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి విఫలమైన అంశాలు, గంజాయి వంటి మత్తు పదార్దాల రవాణా, శాంతి భద్రతల వైఫల్యాలు, జీవో నెంబర్ వన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.