Gorantla Butchaiah : ఈ నెల 17న అమరావతి రైతుల మహాపాదయాత్ర రాజమండ్రిలో ప్రవేశిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... పాదయాత్ర కొవ్వూరు నుంచి గామన్ బ్రిడ్జ్ మీదుగా కాతేరు చేరుకుంటుందన్నారు. 17వ తేదీ నుంచి మూడు రోజులు రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతోందన్నారు. రైతులకు ఘనస్వాగతం పలికి సంఘీభావం తెలపాలని పార్టీ శ్రేణులను కోరుతున్నానన్నారు. రాజమండ్రి బ్రిడ్జ్ పై మరమ్మత్తులు చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో బ్రిడ్జ్ రిపేర్ పూర్తి చేస్తే తన రెండు చెవులు కోసి ఇస్తానన్నారు. మంత్రులది నోరా పత్తి కట్టా అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ తలకిందలుగా తపస్సు చేసినా మూడు రాజధానులు ఏర్పాటు కావన్నారు.
డీజీపీ అధికార పార్టీ తొత్తు
"రైతులు ఎక్కడా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలేదు. ప్రభుత్వానికి భూములిచ్చి సర్వం కోల్పోయాము అనే ఆవేదనలో దైవ దర్శనానికి వెళ్తున్నారు. మంత్రులు, స్పీకర్ ఎలా మాట్లాడుతున్నారో చూశాం. వైసీపీ నేతలు అమరావతి రైతులపై యుద్ధం ప్రకటించారు. రెచ్చగొట్టేలా మంత్రులు మాట్లాడుతున్నారు. వీరితో సీఎం జగన్ మాట్లాడిస్తున్నారు. మంత్రులు బరితెగించి ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయినా ప్రజలు అమరావతి రైతులు బాసటగా నిలుస్తున్నారు. దాడులను నిరోధించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంతంగా నిరసన చేసుకోవచ్చని డీజీపీ అంటున్నారు. ప్రశాంతంగా అరసవెల్లి యాత్రకు వెళ్తామంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు. రోడ్ల మరమ్మత్తుల పేరిట అర్థాంతరంగా బ్రిడ్జ్ మూసివేశారు. రైతుల పాదయాత్రను ఆపేందుకు బ్రిడ్జ్ మూసివేశారు."- గోరంట్ల బుచ్చయ్య
అమరావతి రైతులకు నోటీసులు
కొవ్వూరు నుంచి సాగే అమరావతి రైతుల మహా పాదయాత్ర రూట్ మ్యాప్ ఇవ్వాలని జేఏసీ నేతలకు స్థానిక పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. గోదావరి వంతెన మీదుగా పాదయాత్ర ఎలా సాగుతోందని తెలపాలన్నారు. పాదయాత్ర వెళ్లే దారిలో హోంమంత్రి సమావేశం ఉందని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను తీసుకోడానికి అమరావతి జేఏసీ నేతలు తిరస్కరించారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
మరో మార్గంలో పాదయాత్ర
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 34వ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముగిసింది. ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు జేఏసీ నేతలు. సోమవారం పాదయాత్ర కొవ్వూరు నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేటకు చేరుకోనుందని తెలిపారు. రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిపై ఆంక్షల వల్ల అమరావతి రైతుల యాత్ర మరో మార్గంలోకి మార్చారు. అయితే కొత్తగా వెళ్లే మార్గంలో ఎంత మందితో యాత్ర సాగుతోందో స్పష్టత ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించారు. నోటీసులు తీసుకునేందుకు అమరావతి జేఏసీ నేతలు తిరస్కరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మరో మారు జేఏసీ కో-కన్వీనర్ తిరుపతిరావును నోటీసులు తీసుకోమని ఒత్తిడి తెచ్చారు.
సీఐ కాళ్లపై పడిన జేఏసీ నేతలు
నోటీసుల విషయంలో స్పందించిన జేఏసీ నేతలు తాము న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఏమైనా చెప్పదల్చుకుంటే న్యాయస్థానం ద్వారా చెప్పాలన్నారు. అయినా పోలీసులు నోటీసులు తీసుకోవాలని జేఏసీ నేతలను ఒత్తిడి చేయడంతో యాత్రను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని, ఇంకా ఇబ్బంది పెట్టొద్దంటూ జేఏసీ నేతలు కొవ్వూరు టౌన్ సీఐ రవికుమార్ కాళ్లపై పడబోయారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.