Polavaram Floods : పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీ వరద పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర 30.1 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ అర్ధ రాత్రికి 6 ల‌క్షలు రేపు ఉద‌యానికి 12 ల‌క్షల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తుంద‌ని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద పెరిగింది. గతంలో జులై నెలలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చేది.  


గంటకు 25 సెం.మీ పెరుగుతోన్న నీటిమట్టం  


ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దిగువ కాఫర్ డ్యామ్ దగ్గర గోదావరి నీటి మట్టం 19.5 మీటర్లు ఉంది. దిగువ కాఫర్ డ్యామ్ 21 మీ ఎత్తు పూర్తైంది. గంటకు 25 సెంమీ చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. అర్ధరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ డ్యా్మ్, గ్యాప్-2 పనులు పూర్తిగా నిలిచిపోయే అవ‌కాశం ఉంది. గోదావరి వరద ఉద్ధృతికి దాచారం కుక్కునూరు మధ్యలో రోడ్డు మునిగిపోయింది. 


4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు 


ఎగువ నుంచి గోదావరిలోకి వరద జోరుగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజి తలుపులు అన్నీ ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని శనివారం దిగువకు వదిలారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద అంతా పోలవరానికే వస్తుంది. ఎగువ నుంచి ప్రవాహాలు ఎక్కువే ఉండడంతో  పోలవరం స్పిల్‌ వే గేట్లు తాత్కాలికంగా మూసి పనులు చేయాలనే ఆలోచనకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా వందల కుటుంబాలను అక్కడి నుంచి తరలింపు జరగలేదు. పోలవరం వద్ద గోదావరి వరద వేగంగా పెరుగుతోంది. ఎగువ కాఫర్‌ డ్యాం 42.5  మీటర్ల ఎత్తుకు నిర్మించడంతో స్పిల్‌ వే మీదుగా నీటిని వదిలేసినా ఎగువ కాఫర్‌ డ్యాంపై ప్రభావం ఉంటుంది. పునరావాస కాలనీల నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.