BJP Praja Sangrama Yatra :బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సిద్ధమయ్యారు. ఆగస్టు 2 నుంచి 20 రోజులపాటు పాదయాత్ర చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పాదయాత్ర విషయాన్ని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పన్నాల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, రాష్ట్ర నాయకులు రాజ్ వర్ధన్ రెడ్డిలతో కలిసి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 2 నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అలాగే పోడు భూములు, ధరణి సమస్యలపై బండి సంజయ్ రేపు కరీంనగర్ లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ‘మౌన దీక్ష’ చేపడతారని పేర్కొన్నారు. 


నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు 


రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి పల్లె గోస-బీజేపీ భరోసా పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తరుణ్ చుగ్ ప్రకటించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారన్నారు. రాత్రి పూట పల్లెల్లోనే బస చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనలో గోస పడుతున్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ కా అమ్రుతోత్సవ్ నేపథ్యంలో ఆగస్టు 9 నుంచి 15 వరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త ఇళ్లపై జాతీయ జెండాను ఎగరేయాలని పిలపునిచ్చారు.


బీజేపీలో చేరిన పలువురు నేతలు 
 
నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ వడ్డే రజిత సహా టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి తరుణ్ చుగ్, బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


Also Read : CM KCR : కేంద్రంలో నాన్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి- సీఎం కేసీఆర్


Also Read : CM KCR Review On Rains : రాబోయే మూడు రోజులు బీఅలెర్ట్, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - సీఎం కేసీఆర్