Weather Updates: ఉపరితల ద్రోణి ప్రభావం, పలుచోట్ల కురిసిన తేలికపాటి జల్లులు కురుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయ్. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణ, యానాంలలో పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉండగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉపరితల ద్రోణి ప్రభావం, ట్రోపో వాతావరణంలో గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. అత్యధికంగా తునిలో 41.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 40 డిగ్రీలు, ఒంగోలు, అమరావతిలో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఈ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలుచోట్ల నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమే ఉంటుంది కానీ వర్ష సూచన లేదని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అనంతపురంలో 41.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల, తిరుపతిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆరోగ్యవరంలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయి. కొన్ని జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.