Rains In Ap: తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి ఉగ్రరూపంతో పగటి పూటే కాకుండా రాత్రి పూట సైతం జనం విల్లావిల్లాడుతున్నారు. తెలంగాణలో (Telangana) శనివారం ఒక్కరోజే వడదెబ్బకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోనూ (Ap) అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీ వాసులకు కూల్ న్యూస్ అందించింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 - 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అటు, ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి సహా కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.


కొన్ని ప్రాంతాలకు అలర్ట్


అయితే, ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 187 మండలాల్లో వడగాలులు వీచాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా కలసపాడులో 46.4, నంద్యాలలోని కోవెలకుంట్లలోని 46.2, నెల్లూరులోని వేపినాపి అక్కమాంబపురంలో 46.1, కర్నూలులోని వగరూరులో 45.7, పల్నాడు జిల్లా విజయ్ సౌత్ పురిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. రాత్రిపూట కూడా వేడిగాలులు కొన్ని చోట్ల అధికంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.


వడదెబ్బతో..


పల్నాడు జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దుర్గికి చెందిన కొత్త పూర్ణచంద్రరావు (62), క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన వెంకాయమ్మ (80) అనే వృద్ధురాలు మృతి చెందారు. కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని మిడుతూరులో ఎండవేడికి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డారు. విశాఖలో ఓ బాలుడు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. పగటిపూట బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని పేర్కొంటున్నారు.


తెలంగాణలో ఇదీ పరిస్థితి


అటు, తెలంగాణలోనూ భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో ఎండదెబ్బకు 19 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


Also Read: Ambati Rambabu: మంత్రి అంబటికి ఇంట్లో నుంచే బిగ్ షాక్! ఘోరమైన తిట్లతో ఆరోపణలు చేసిన అల్లుడు - సంచలన వీడియో