Weather Updates: ఉపరితల ఆవర్తనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో కేవలం ఉత్తర కోస్తాంధ్రను మినహాయిస్తే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎండలు మండిపోతాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండగా.. మిగతా ప్రాంతాల్లో భానుడి ప్రతాపానికి ప్రజలు తట్టుకోలేరు అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు.
ఏపీలో ఇక్కడ వర్షాలు.. అక్కడ భానుడి భగభగలు
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల దాక నమోదుకానున్నాయి. మరో మూడు రోజుల్లో ఎండలు మరింత పెరగనుండటంతో 45 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమలో గరిష్టంగా కర్నూలులో 41.3 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లాలో 40.6 డిగ్రీలు, అనంతపురంలో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు రోజూ 5 లీటర్ల మంచినీళ్లు తాగాలని సూచించారు.
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాలోని పలుచోట్ల, పార్వతీపురం మణ్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. మిగిలిన రాష్ట్రంలోని ఒకట్రెండు చోట్ల మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమతో పోల్చితే ఇక్కడ కాస్త చల్లగా ఉంది. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా నందిగామలో 38.1 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 38 డిగ్రీలు, అమరావతిలో 37.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలు..
వరుసగా రెండు రోజులు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడంతో శనివారం నాడు ఉష్ణోగ్రతలు తగ్గాయి. నేడు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ జిల్లాల్లో 40 డిగ్రీలు, హైదరాబాద్‌లో 36.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 37.8 డిగ్రీలు, భద్రాచలంలో 38.5 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.