AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత 3 రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశ గమనాన్ని బట్టి ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయని వెల్లడించింది.


మత్స్యకారులకు అలర్ట్


వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రధానపోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఈ క్రమంలో ఉత్తరంగా దిశ మార్చుకుని ఒడిశాలోని పారాదీప్‌కు 520 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది బలపడి రాత్రికి ఉత్తర ఈశాన్యంగా బంగ్లాదేశ్ వైపు వెళ్లింది. సోమవారం మధ్యాహ్నానికి ఇది తుపానుగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి 'హమూన్' అని నామకరణం చేశారు.


ఈశాన్య పవనాల ఆగమనం


మరోవైపు, ఈశాన్య రుతు పవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో వర్షాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. మరో 2 రోజుల్లో ఏపీలోనూ ఈశాన్య పవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.


అరేబియాలో తేజ్ తీవ్ర తుఫాను


ఇదిలా ఉండగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తేజ్ తీవ్ర తుఫాను మరింత బలపడుతోంది. ఇది భారతదేశ తీరానికి దూరంగా కేంద్రీకృతమై ఉంది. యమెన్, ఒమన్ దేశాల వైపు అది కదులుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం భారత్ పై అంతా ఉండకపోవచ్చని తెలిపింది.