Rains In Telangana: రాష్ట్రంలో మరో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో ఆదివారం వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురవగా, మిగతా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం (జులై 23) నుంచి సోమవారం (జులై 24) వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే.. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో రెండు నుంచి నాలుగు రోజులపాటు పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది.
ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురవనున్నాయి. ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
ఐఎండీ అంచనాల ప్రకారం ఎగువ ఉన్న గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 41.4 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.41 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. ఆదివారం నుంచి ధవళేశ్వరం వద్ద వరద పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వరద చేరే అవకాశం ఉన్నందని అన్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారం ఆదివారం నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు వరద స్వల్పంగా పెరుగుతూ ప్రవహించనున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 1ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.