Rains In Andhra Pradesh | అమరావతి / హైదరాబాద్: దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ గఢ్, ఒడిశాలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులపాటు దానా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మూడు, నాలుగు రోజులనుంచి తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది.
ఏపీ, యానాంకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ తో పాటు యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీచనున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది.
తెలంగాణలో నేటి నుంచి తేలికపాటి వర్షాలు
తెలంగాణలో గత వారం రోజులనుంచి వాతావరణంలో ఏ మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం సాయంత్రం లేక రాత్రి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అయితే తేలికపాటి జల్లులే కావడంతో ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు. వర్షాల కోసం ఎదురుచూసే రైతులకు నిరాశ తప్పదు. పంట దిగుబడికి సిద్ధంగా ఉన్న రైతులు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తెలంగాణలో పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఉక్కపోత అధికమవుతోంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు నమోదు కాగా, రాత్రిపూట 21.2 డిగ్రీలకు పడిపోయింది. రాష్ట్రంలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు ఖమ్మం, భద్రాచలంలో 35 డిగ్రీలు నమోదు కాగా, 30 డిగ్రీలతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో 34.5 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 33.3 డిగ్రీలు, హన్మకొండ, రామగుండంలో 33 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్ చెరులో కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆపై మెదక్ లో 18.8 డిగ్రీలు, రాజేంద్రనగర్ లో 19.5 డిగ్రీలు మాత్రమే 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన కేంద్రాలుగా ఉన్నాయి.