నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమన రేఖ కళింగపట్నం, నందిగామ, కర్నూలు, గదగ్ , మజలి ప్రాంతాల గుండా వెళుతుంది. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలలో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో 106.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి
తిరుపతిలో ఘోరం జరిగింది. భారీ వర్షానికి నీటిలో మునిగి నవ వధువు మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు కర్ణాటక రాయచూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా భారీ వర్షం కురిసింది. తిరుపతి వెస్ట్ చర్చి అండర్ బ్రిడ్జి లోకి భారీగా వరద నీరు చేరింది. ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం వరద నీటిలో చిక్కుకుంది. వాహనంలోని నవ వధువు సంధ్య వరద నీటిలో చిక్కుకొని చనిపోయింది. మరో చిన్నారి అస్వస్థత గురైంది. వరద నీటిలో వాహనం చిక్కుకున్న విషయాన్ని గమనించి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు మిగతా వారిని రక్షించారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
Also Read: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్