Raghuramakrishna Raju :  మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ  జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో జరిగిన ఘటనలతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా జత చేశారు. 


పుట్టిన రోజు నాడు అరెస్టు చేసిన సీఐడీ అధికారులు            


2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్నారు. ఆ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న  సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. అయితే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రోజు రాత్రి గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉంచారు. అరెస్టు చేసిన తర్వాత సీఐడీ అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. కుట్ర ఉందని కేసు పెట్టారు.


అదే రోజు రాత్రి కస్టోడియల్ టార్చర్                


ఉదయమే కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆయన నడవలేకపోయారు. కోర్టులో తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. తనను కొడుతున్న దృశ్యాలను లైవ్ లో ఇతరులకు చూపించారని రఘురామ ఆరోపించారు. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో దీంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించాలని ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు గాయాలు కాలేదని.. వేరే సమస్యల వల్ల కాళ్లకు ఇబ్బందులు వచ్చాయని నివేదిక ఇచ్చారు. అయితే డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని.. తనకు హైదరాబాద్‌లో సైనిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో  పరీక్ష - కొట్టారని  రిపోర్ట్ 


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  హైదరాబాద్ సైనిక ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఆయనకు గాయాలు అయినట్లుగా తేలింది. బలమైన వస్తువుతో కొట్టడం ద్వారా గాయం అయినట్లుగా తేలడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రాజద్రోహం సెక్షన్లను నిలిపివేసింది. ఆ తర్వాత తనపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్ర పరిచేలా.. ఆదేశాలు తెచ్చుకున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. 


జగన్ చంపాలని చూశారని ఆర్ఆర్ఆర్ ఆరోపణ                 


జగన్మోహన్ రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామ గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం  మారడంతో రఘురామ ఫిర్యాదుపై గుంటూరు ఎస్పీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాడు సొంతంగా కేసు పెట్టిన అధికారులు.. అందరి కాల్ రికార్డులు భద్రపర్చి ఉండటంతో.. ఒక వేళ దర్యాప్తు చేస్తే .. జగన్, ఐపీఎస్ సునీల్ కుమార్ ఇబ్బందుల్లో పడుతారన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది.