Raghuramakrishna Raju from Undi :  నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన పోటీ ఖాయమని చెబుతున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన తన పోటీ ఖాయమంటున్నారు. తాజాగా భీమవంలో మీటింగ్ పెట్టారు.  జగన్ ను ఓడించే సత్తా తనకు ఉందని, జగన్ ను ఓడించే స్థాయికి తాను ఎదిగానని  స్పష్టం చేశారు.  తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని… కూటమి నుంచి పోటీ చేయడమే తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై తనకు చాలా మంది సలహాలు ఇస్తున్నారని.. ఎక్కడి నుంచి బరిలోకి దిగినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.


తన నియోజకవర్గం నుంచి తనను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు తనపై ఎన్నో తప్పుడు కేసులు మోపి, వ్యక్తిగతంగా వేధించారని రఘురాజు అన్నారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించానని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని అన్నారు. వైసీపీ పాలనలో కేవలం భీమవరంలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థి శ్రీనివాసవర్మ కూడా పాల్గొన్నారు. 


అంతకు ముందు గోదావరి జిల్లాల్లో ప్రజాగళం ప్రచార ాయత్రలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడుతోనూ నల్లజర్లలో సమావేశం అయ్యారు. ఆ సమావేశం తర్వాత కూడా తన పోటీ ఖాయమని ప్రకటించారు. నిజానికి పోటీ చేయడానికి రఘురామకృష్ణరాజుకు స్పేస్ లేదు.  ఎందుకంటే అన్ని  నియోజకర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశారు.   ఇప్పుడు రఘురామకు సీటు కేటాయించాలంటే ఇతరులకు సీటు లేకుండా చేయాలి.                         


నర్సాపురం ఎంపీ స్థానం టీడీపీకి ఇచ్చేలా .. చంద్రబాబు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ స్థానం బీజేపీకి ఇచ్చి నర్సాపురం టీడీపీకి తీసుకుని రఘురామకు చాన్సిస్తారని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ అంశం కూడా స్పష్టత లేదని.. బీజేపీ పెద్దలు స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగా రఘురామకృష్ణరాజుకు.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. మరో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.                                                


మరో వైపు ఆనపర్తి స్థానం అంశం కూడా కూటమిలో చర్చనీయాంశమవుతోంది. కొన్ని సీట్లలో మార్పు, చేర్పులు ఉండవచ్చని.. వీటిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.