Realme C65 Launched: రియల్‌మీ సీ65 స్మార్ట్ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు, మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లలో ఉన్నాయి. ఈ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


రియల్‌మీ సీ65 ధర (Realme C65 Price)
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 36,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.12,000) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 42,90,000 వియత్నాం డాంగ్‌లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 47,90,000 వియత్నాం డాంగ్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,000) ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన సేల్ వియత్నాంలో జరుగుతోంది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


రియల్‌మీ సీ65 స్పెసిఫికేషన్లు (Realme C65 Specifications)
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ అందించారు. దీన్ని వర్చువల్‌లో మరో 8 జీబీ పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందింాచరు. ఈ ఫోన్‌లో 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.


బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఐపీ54 వాటర్ రెసిస్టెంట్ బిల్ట్‌ను ఈ ఫోన్‌లో అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఈ ఫోన్‌లో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది.  డైనమిక్ బటన్, ఎయిర్ జెస్చర్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.


రియల్‌మీ సీ65లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 30 సెకన్ల పాటు ఫోన్‌ను ఛార్జింగ్ చేస్తే 43 నిమిషాల కాలింగ్ టైమ్‌ను ఇది అందించనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు