Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. పాంచ్ న్యాయ్ పేరుతో మొత్తం 25 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమి తరపున ప్రధాని అభ్యర్థి ఎవరని మీడియా ప్రశ్నించగా రాహుల్ బదులిచ్చారు. తమది సైద్ధాంతిక పోరాటం అని, ఎన్నికల తరవాతే ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని, ఎవరు గెలవాలన్నది ముందే డిసైడ్ చేసేస్తున్నారని మండి పడ్డారు. కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే పనిలో ఉన్నారంటూ బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమి అంతా ఒక్కటిగానే ఉందని, కచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసం ఉందని వెల్లడించారు. 


"I.N.D.I.A కూటమి ఈ సారి ఎన్నికల్లో సైద్ధాంతిక పోరాటం చేయనుంది. ఈ ఎన్నికలంతా పూర్తయ్యాకే ప్రతిపక్ష కూటమి తరపున ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాం. అయినా...ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదు. రిగ్గింగ్ మ్యాచ్‌లాగా ముందే ఫలితాలు డిసైడ్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఈ ఎన్నికల కన్నా మరో మంచి అవకాశం ఉండదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని కుట్ర చేస్తున్నా వాళ్లకి, వాటిని కాపాడుకునే వాళ్లకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ






కాంగ్రెస్ మొత్తం 25 గ్యారెంటీలు ప్రకటించింది. పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులు, యువత, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ హామీలు రూపొందించింది. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత, రిజర్వేషన్‌లపై ఉన్న 50% పరిమితిని తొలగించడం, అందుకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి రాజ్యాంగ సవరణ చేయడం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనీ హామీ ఇచ్చింది కాంగ్రెస్. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం, అగ్నివీర్ స్కీమ్ రద్దు, ఎలక్టోరల్‌ బాండ్స్‌పై విచారణ తదితర హామీలను ఈ మేనిఫెస్టోలో చేర్చింది. అంతే కాదు. వ్యవసాయ పరికరాలకు జీఎస్‌టీ మినహాయింపుతో పాటు రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. మహాలక్ష్మి పథకం కింద పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌లు కల్పిస్తామని వెల్లడించింది. 


Also Read: భారత్‌ తొలి ప్రధాని నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్ - కంగనా కామెంట్స్ వైరల్