Kangana Ranaut on First PM: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేయనుంది. చాలా రోజులుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఇంతలో బీజేపీ ఆమెకి టికెట్ ఇచ్చింది. ఎప్పుడూ వివాదాల్లో ఉండే కంగనా...ఇప్పుడు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మార్చి 27వ తేదీన ఓ ఈవెంట్‌కి హాజరైన ఆమె భారత దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్‌ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరు చెప్పకుండా సుభాష్ చంద్రబోస్ పేరుని ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఆమె కామెంట్స్ చూసి షాక్ అవుతున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ అని చాలా క్లారిటీగా చెప్పింది. ఆ తరవాత ఆ కామెంట్స్‌పై వివరణ ఇచ్చింది. సుభాష్ చంద్రబోస్‌ని ప్రధానమంత్రిగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఆ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లిపోయారని, అలా అదృశ్యమయ్యేలా ఎవరు కుట్ర చేశారని ప్రశ్నించింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం జపాన్, జర్మనీతో పోరాడిన ఆయనను చివరికి భారత్‌లోనే అడుగు పెట్టకుండా చేశారని మండి పడింది. అయితే...ఈ కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. 




నిజానికి సుభాష్ చంద్రబోస్ 1945లోనే ఆగస్టు 18న మృతి చెందారు. భారత్‌కి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అలాంటప్పుడు చంద్రబోస్ ఎలా ప్రధాని అవుతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే..ఇంకొందరు ఆమె వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వ్యంగ్యంగా పోస్ట్‌లు పెట్టారు. కంగనా రనౌత్ అభిప్రాయం ప్రకారం...భారత్‌కి 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడే స్వాతంత్ర్యం వచ్చిందని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ భారత్‌కి తొలి ప్రధాని అని కొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.