R Narayana Murthy Comments: రాముడు గురించి చెప్పడం.. రామాలయాలు కట్టడమే కాదు.. రాముడికున్న సద్గుణాల్లో ఒకటైన ఒకటే మాటను.. చెప్పిన దానిని ఆచరించడం పాలకులు ఆదర్శంగా తీసుకుని ఆచరించాలని పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కోరారు. మంగళవారం (డిసెంబర్ 19) సాయంత్రం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో జరుగుతున్న నాటకోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నేటి ప్రధానమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చి తిరుమల తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని వాగ్దానం చేసి దానిని ఆచరించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ తదితరులు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలన్నారని పార్లమెంట్లో చెప్పిన జరిగిన విషయాలను ఆయన గుర్తు చేశారు. 


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు అలాగే 32 మంది తెలుగు ప్రజల త్యాగాలతో నిర్మితమైన ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చత్తీస్ గఢ్ లో వేరే ప్రాంతాల్లో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీలను కాపాడటమే కాదు.. చరిత్రాత్మక మైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కాపాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇనుప  ఖనిజం గనులను విశాఖ స్టీల్ కు కేటాయించకపోవడంతోనే స్టీల్ ప్లాంట్ కు మధ్యమధ్యలో నష్టాలు వస్తున్నాయన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి, ఏపీకి గర్వకారణమైన స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు, విశాఖపట్నం కూడా భారతదేశం లోనే ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 


స్టీల్ ప్లాంట్ లో భాగమైన గంగవరం పోర్టును ఇప్పటికే ఆడాని కంపెనీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


ఇటీవల పార్లమెంటులోకి యువకులు చొచ్చుకొని వెళ్లి పొగను వదలడం భద్రత వైఫల్యం అని నారాయణ మూర్తి అన్నారు. అందరికీ ఆందోళన కలిగించిందన్నారు. అయితే వారు నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలు, వైఫల్యాలకు సంబంధించి పార్లమెంట్లో నిరసన తెలియజేయడానికి వచ్చామని చెబుతున్నారని.. అటువంటిది కాకుండా వారు పార్లమెంట్ సభ్యులపై దాడికి వచ్చినట్లయితే ఎంత ఘోరం, నష్టం జరిగేదో అందరికీ తెలిసిందే అన్నారు. పార్లమెంటుకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. దానికి  ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. 


ఇటీవల  త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపై ఆరోపణలు ఉన్నాయని ఆమెను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత దారుణమైన ఘటనలో ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో మౌనంగా ఉండి బాధ్యతలు తప్పించుకోవాలని చూడడం ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుందన్నారు. ప్రశ్నలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి, ప్రజావ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ లు ఆనాటి నేషనల్ అసెంబ్లీలో పొగ బాంబును విసిరారని అన్నారు. ప్రజలే తన సినిమాలకు నిర్మాతలని చోదక శక్తులని ఆయన చెప్పారు. ‘నిరుద్యోగమా.. పేపర్ లీక్’ అనే సినిమాను తీస్తున్నట్లు తెలియజేశారు.