PV Ramesh On AP Assigned Lands Issue :  8 ఎకరాల విషయంలో జార్ఖండ్‌ సీఎం   జైలుకు వెళ్లారని మరి ఏపీలో వేల కొద్దీ అసైన్డ్ ల్యాండ్స్ ను రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, కాంట్రాక్టర్ల సంగతేమిటని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన పెట్టిన ట్వీట్ కలకలం రేపుతోంది. 


1953లో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఎకరాలను పేదలకు .. జీవనోపాధి కోసం అసైన్ చేశారని పీవీ రమేష్ తెలిపారు. ఈ భూమి పూర్తిగా వారి జీవనోపాధి కోసమే కానీ అమ్మకానికి కాదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2023లో అసైన్డ్ ల్యాండ్స్ చట్టానికి సవరణ చేసిందని తెలిపారు. ఈ చట్టం వల్ల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ ల్యాండ్స్ ను పెద్ద ఎత్తున ధనవంతులు, అధికార బలం ఉన్న వారు లాగేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం 2023లో తీసుకు వచ్చిన చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాలు చేతులు మారిపోయే ప్రమదం ఉందన్నారు. 


తక్షణం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అసైన్డ్ ల్యాండ్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విచారణ చేయించాలని .. వీటి వెనకు ఉన్న స్కాముల్ని బయట పెట్టాలని కోరారు. 





 
ప్రస్తుతం ఏపీలో అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో వివాదం జరుగుతోంది. సీఎస్ జవహర్ రెడ్డి,  ఆయన కుమారుడు దాదాపుగా ఎనిమిది వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ భూముల్ని బినామీల పేరుతో కొనుగోలు చేశారని వాటి విషయంలోనే రహస్య పర్యటనలు చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆయన పలువురు బినామీ పేర్లను కూడా ప్రకటించారు. అయితే తాను  కానీ.. తన కుమారుడు కానీ విశాఖ, బోగాపురం ప్రాంతంలో ఎక్కడా భూములు కొనలేదని.. అసైన్డ్ ల్యాండ్స్ తమ పేరు మీద లేవని అంటున్నారు. మూర్తి యాదవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని.. సీబీఐతో విచారణ చేయించాలని మూర్తి యాదవ్ అంటున్నారు.                              


మరో వైపు సీఎస్ పై టీడీపీ కూడా తీవ్రమై ఆరోపణలు చేస్తోంది. ఈ సమయంలో అసైన్డ్ ల్యాండ్ చట్టం .. భూకబ్జా దారుల కోసమేనని .. విచారణ చేయించాలని పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.