Chalapathi Rao Death:: బీజేపీ సీనియర్ నాయకుడు పీవీ చలపతిరావు పార్టీకి, సమాజానికి చేసిన సేవలు మరువలేనివి అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  ఆయన సోమవారం చలపతిరావు ఇంటి వద్దకు వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. చలపతిరావు మరణవార్త తెలిసిన వెంటనే ఆ విషయాన్ని తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశానని, వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వ లాంఛనాలతో చలపతిరావు అంత్యక్రియలు జరిపించాలని ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే తాను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించామని వివరించారు.


Chalapathi Rao Demise : పీవీ చలపతిరావు సేవలు మరువలేనివి-  మంత్రి అమర్నాథ్


అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ చలపతి రావుకు ఉత్తరాంధ్ర ప్రజలతో అవినావబావ సంబంధం ఉందని అన్నారు. సుమారు 65 సంవత్సరాలు పాటు ఆయన ప్రజల కోసం పోరాటం చేశారని, భావితరాలకు చలపతిరావు జీవితం ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. 12 సంవత్సరాల పాటు ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించిన చలపతిరావు ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారానికి నిస్వార్ధంగా పని చేశారని స్పష్టం చేశారు. 1950వ సంవత్సరం నుంచి విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించారని అన్నారు. కార్మిక సంఘ నాయకునిగా పరిశ్రమల, కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారని వివరించారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిన వారిలో చలపతిరావు ఒకరు అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. 


భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్ర పోషించి, హరిబాబు వంటి సీనియర్ నాయకులకు చలపతిరావు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి గుడివాడ అమర్నాత్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఘనత చలపతి రావుకి దక్కుతుందని అన్నారు. విశాఖ నగర తొలి మేయర్ ఎన్నికలో చలపతి రావు కీలక పాత్ర పోషించి ఆ పదవి బీజేపీ కైవసం చేసుకునే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. అనకాపల్లి తొలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాలుగైదు స్థానాలును సాధించడంలో చలపతిరావు విశేష కృషి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న చలపతిరావు కుమారుడు మాధవ్, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకు  వెళ్తారనే నమ్మకం తనకు ఉందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. 


అనారోగ్య సమస్యలతో మృతి చెందిన పీవీ చలపతిరావు


బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ చలపతిరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చలపతిరావు. ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. పీవీ చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్  ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. చలపతిరావు భౌతిక కాయాన్ని మరి కాసేపట్లో  ఇసుకతోట పిఠాపురం కాలనీకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పీవీ చలపతిరావు మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అభివృద్ధి కోసం చలపతిరావు నిరంతరం కృషి చేశారన్నారు. చలపతిరావు తనకు మార్గదర్శకులని సోము వీర్రాజు తెలిపారు. కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆనాటి జనసంఘ్‌ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నేతల్లో చలపతిరావు ముఖ్యులని సోము వీర్రాజు గుర్తుచేశారు.