Purandeswari At Vizag :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు..కట్టిన ఇళ్లకు శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ జోనల్ కమిటీ సమావేశాల్లో భాగంగా ఆమె విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.  తమ జేబులు నింపుకోడానికి ఏపి పాలకులు పాకులాడుతున్నారని మండిపడ్డారు.  చేసిన అప్పులు, కట్టిన ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం అనధికారికంగా రూ. 4 లక్షల 74 వేల కోట్లు అప్పులు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆమె ఆరోపించారు. 


విశాఖకు కేంద్ర ప్రభుత్వం లక్షా 57 వేల ఇళ్లు ఇచ్చిందని, ఏపిలో జగన్‌ ప్రభుత్వం పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని పురంధేశ్వరి డిమాండ్‌ చేశారు.ఏపికి బీజేపీ ఏమీ చేయలేదనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వైజాగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ పెట్టిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆమె అన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేస్తే ఇక సామాన్యుల గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కరోనా సమయంలో శ్లాబులు మార్చి ప్రజలపై వెయ్యి 500 కోట్ల రూపాయల భారం వేసినట్లు ఆమె ఆరోపించారు.






 


గురువారం  ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన  పురందేశ్వరి జగన్‌ ప్రభుత్వం నిధులు మళ్లించడంతోపాటు విచ్చలవిడిగా రుణాలు తీసుకుంటోందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఫిర్యాదు చేశారు.   జగన్‌ ప్రభుత్వం వివిధ రూపాలలో తీసుకున్న అప్పులు, చెల్లించాల్సిన బాకాయిలు, నిధుల మళ్లింపు చిట్టాను అందించారు. అనంతరం నార్త్‌ ఎవెన్యూలోని ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మొత్తం అప్పులు రూ.97వేల కోట్లు ఉందని, 2014 నుంచి 2019 నాటికి అది రూ.3,62,375 కోట్లకు పెరిగిందని తెలిపారు. ప్రస్తుత జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆ అప్పు రూ.10,77,000 కోట్లకు పెరిగిందన్నారు. నాలుగేళ్ల వైసీసీ పాలనలో రూ.7,14,625 కోట్ల అప్పుల భారం పడిందని వివరించారు. రుణాలు, బాకాయిలు, మళ్లించిన నిధుల విషయంలో జగన్‌ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. 


ఆర్బీఐ బాండ్ల ద్వారా రూ.2,39,716 కోట్లు రుణాలు తీసుకున్నారని, నాబార్డ్‌ లోన్ల కింద రూ.7,992 కోట్లు, కాంటింజెంట్‌ నిధులు రూ.50కోట్లు, కార్పొరేషన్ల ద్వారా, రూ.98,603 కోట్లు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, రూ.98,603కోట్లు, జాతీయ భద్రత నిధి నుంచి రూ.8,948కోట్లు, రాష్ట్ర ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10,000 కోట్లు, ఏపీ మారిటైమ్‌ బోర్డు ద్వారా రూ. 5,000 కోట్లు, డిస్కంలకు బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలకు చెల్లింపులు 27,384 కోట్లు, పౌర సరఫరాల శాఖ ద్వారా రూ.35,000 కోట్లు, మద్యం అమ్మకాల ద్వారా భవిష్యత్తు ఆదాయం చూపించి రూ.8,005 కోట్లు (9.6శాతం వడ్డీతో), చిన్న కాంట్ర్టాక్టర్లు, సరఫరాదారులకు చెలింపులు రూ. 71,500 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.33,100 కోట్లు, ప్రభుత్వ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ఉపసంహరణ రూ.11,170 కోట్లు, పబ్లిక్‌ అకౌంట్స్‌ ఫండ్స్‌ ద్వారా రూ. 26,850 కోట్లు, గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపు రూ.868 కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధుల మళ్లింపు రూ.1,100 కోట్లు, వాడుకున్న సింకింగ్‌ ఫండ్స్‌ రూ.2,774 కోట్లు, ఎన్‌పీఎస్‌ నిధులు 1,338 కోట్లు, జెన్‌ కో, ట్రాన్స్‌ కో ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ 3600 కోట్లు, ఈఎ్‌సఐ నిధులు 155 కోట్లు, జీపీఎఫ్‌ నిధులు 15000 కోట్లు, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ నిధులు 900 కోట్లు ఉన్నాయని పురందేశ్వరి వివరించారు.