Private hospitals in AP are stopping NTR Vaidya Seva: ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచిత చికిత్సలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 2,700 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక భారం పెరిగిన నెట్‌వర్క్ ఆసుపత్రులు, అక్టోబర్ 10 నుంచి పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేస్తామని  ప్రకటించాయి.  ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్   ఈ నిర్ణయం  ప్రకటించింది.                             

Continues below advertisement

  ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే, అక్టోబర్ 10 నుంచి డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం కింద అన్ని సేవలు పూర్తిగా ఆపేస్తామని  ప్రైవేటు ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు కె. విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్‌వీఎల్ నారాయణరావు  స్పష్టం చేశారు.  జూన్ 2024లో టీడీపీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు 5,300 కోట్ల రూపాయలకు పైగా సేవలు అందించాయని.. ఇందులో 3,800 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు.  మిగిలిన 2,700 కోట్లు, మునుపటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపి పెరిగాయన్నారు.                       

"2,000 కోట్ల బిల్లులు 400 రోజులకు పైగా స్క్రూటినీలో ఉన్నాయి. ఎప్పుడు విడుదల అవుతాయో స్పష్టత లేదు. పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన 670 కోట్లు కూడా విడుదల కాలేదు" అని  ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి.   "ప్రీ-ఆపరేటివ్ పరీక్షలు, రక్త పరీక్షలు, స్కాన్లు వంటి సేవలకు ఇక రోగులు తమ జేబులోంచి చెల్లించాల్సి వస్తుంది. చికిత్సలు ఉచితంగానే ఉంటాయి, కానీ పథకం కింద అన్ని సేవలు ఆగిపోతాయి" అని తెలిపారు.                  

Continues below advertisement

ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. 2024 ఆగస్టులో 2,500 కోట్ల బకాయిలతో సేవలు ఆపేస్తామని ఏషా హెచ్చరించింది. జనవరి 2025లో 500 కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం, మార్చి చివరిలో 300 కోట్లు మరోసారి చెల్లించింది. అయినప్పటికీ, మొత్తం బకాయిలు 3,500 కోట్లకు చేరాయి. ఏప్రిల్ 7 నుంచి క్యాష్‌లెస్ సేవలు పూర్తిగా ఆపేసిన ఆసుపత్రులు, మే మధ్యలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు జోక్యంతో మళ్లీ ప్రారంభించాయి. సెప్టెంబర్ 16 నుంచి ఓపీడీ సేవలు ఆపేసిన ఏషా, 2,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పేర్కొంది.

రాష్ట్రంలో 360కి పైగా ఎంపానెల్డ్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవి ప్రతి నెలా 380 నుంచి 420 కోట్ల ఖరీదైన వైద్యం  చేస్తున్నాయి.  ప్రభుత్వ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన లేదు. ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఇటీవల అసెంబ్లీలో 670 కోట్లు పోర్టల్‌లో అప్‌లోడ్ చేశామని చెప్పారు. అయితే, వాటి విడుదలపై స్పష్టత లేదు. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది.