Ntr Coin: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరుతో రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఈ రూ.100 నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు.
ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. నాణెం విజుదలకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
చారిత్రక ఘటనలు ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీ వస్తోంది. 1964 నుంచి నాణేలను విడుదల చేస్తోంది కేంద్రప్రభుత్వం. మొదటిసారి మాజీ ప్రధాని నెహ్రూ వెండి నాణెం విడుదల చేయడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో వెండి నాణేన్ని విడుదల చేయడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.
సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.