రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు(ఆదివారం) ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ఎపీలో పర్యటించనున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సభా ప్రాంగణం మురళీ రిసార్ట్స్‌కు వెళ్లే పోరంకి- నిడమానూరు మార్గానికి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పిచ్చి చెట్లను, ముళ్ల కంపను ప్రత్యేక యంత్రాలతో తొలగించే పనిలో అధికారులు బిజిగా ఉన్నారు. రహదారులను సుందరంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా గుంతలను పూడ్చి అవసరం అయిన చోట రోడ్డు నిర్మాణం చేస్తున్నారు.
నారాయణపురం కాలనీ సమీపంలో విశాలమైన ప్రదేశంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ బుల్ డోజర్లతో చదును చేశారు అధికారులు. కిలోమీటర్ దూరం నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డుకు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోరంకి- నిడమానూరు రోడ్డులో ఆధునాతన ఎత్తయిన స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతితో పాటుగా గవర్నర్...
రాష్ట్రపతి, గవర్నర్ వస్తున్న సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ జాషువా, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఓఎస్పీ శశిధర్ రెడ్డి తెలిపారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరుగుతున్న పౌరసన్మాన ఏర్పాట్లను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పర్యటించారు. ఐదుగురు ఎస్పీలు, 14 మంది సీఐలు, 36 మంది ఎస్సైల ఆధ్వర్యంలో 400 మంది పోలీస్ సిబ్బందిని భద్రత కోసం కేటాయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
భద్రతా బలగాల ఆధీనంలో విమానాశ్రయం...
గన్నవరం విమానాశ్రయాన్ని ఇప్పటికే భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పోలీసు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విమానాశ్రయం పరిసరాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానశ్రయం రన్ వేతో పాటుగా పక్కేనే ఉన్న చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారి, విమానాశ్రయం పరిసరాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను కూడా మోహరించారు. పోలీసులు అణువణువు తనఖీలు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో జిల్లా ఎస్పీ జాషువా విమానాశ్రయంలో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
తొలిసారి రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తున్నందున షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణ ఉండేలా చూస్తున్నారు అధికారులు. నారాయణపురం కాలనీ నుంచి తోడు కాలవ కట్ట రోడ్డు విమానాశ్రయం ఆవరణలో స్వాగతం, విశ్రాంతికి ఏర్పాట్లు చేశారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆదేశించారు. భద్రత చర్యల్లో పాల్గొనే వైద్య, పోలీసు, ఇతర విభాగాల సిబ్బందికి పలు పరీక్షలు నిర్వహించారు.
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా విజయవాడ రాజ్ భవన్‌కు రాష్ట్రపతి వెళతారు. రోడ్లకు ఇరువైపులా పోలీసులు వలయంగా ఉండి భ్రదత పర్యవేక్షిస్తారు. హైవేపై పారిశుద్ధ్య పనులు చేసే వారి వివరాలను కూడా పోలీసులు సేకరించారు. విమానాశ్రయం నుంచి గూడవల్లి వరకు ఉన్న కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం సుమారు 800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.