రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సులభ వాయిదా పద్దతుల్లో ఉద్యోగులందరికీ వాహన యోగం కలిగించాలని సీఎం జగన్ ఆలోచించారు. అనుకున్నదే తడవుగా వివిధ కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున రాయితీ ఇస్తారు, ఈఎంఐలకు భరోసా ఇస్తారు. ఉద్యోగులు కొన్నిసార్లు డౌన్ పేమెంట్ లేకుండానే వాహనం తీసుకుపోయే అవకాశం కూడా కలిగించారు. కానీ ఎక్కడా ఎవరూ ఆసక్తి చూపించడంలేదు.


నెల్లూరు పరిస్థితి చూస్తే..


నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 50వేల మంది వరకు ఉంటారు. వీరంతా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టుకు అర్హులే. వీరందరి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. నవంబర్ మొదటి వారంలో అర్హులంతా దరఖాస్తు చేయాలని, సులభ వాయిదా పద్దతుల్లో వాహనాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అంత కనిష్టంగా దరఖాస్తులు రావడంతో అధికారులే షాకవుతున్నారు.


50వేలకు 14 దరఖాస్తులు..


50వేలమంది ఉద్యోగులు ఉండగా, ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు కేవలం 14మాత్రమే. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇప్పటికే అందరికీ వాహనాలు ఉన్నాయి. వాటిని పక్కనపెట్టి కొత్తగా ప్రభుత్వం వాహనాలు ఇస్తుంది కదా అని ఈఎంఐ భారం పెంచుకోలేక చాలామంది వెనకడుగేశారని అంటున్నారు.


భద్రత కూడా ప్రశ్నార్థకమే..


మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల చాలా రకాల కంపెనీల వాహనాలు చార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోయిన ఉదాహరణలున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలంటేనే ప్రజల్లో ఒకరకమైన అనాసక్తి ఏర్పడింది. ఈ దశలో ప్రభుత్వం సులభ వాయిదాలు అంటున్నా కూడా ఉద్యోగులెవరూ ముందుకు రావడంలేదు.


పేపర్ లెస్ విధానమే ఇబ్బందిగా మారిందా...?


ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేసే ఉద్యోగులు అంతా ఆన్ లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. మోడళ్లను ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి, ఆ శాఖ అధికారి ఆమోదం, ఆ తర్వాత బ్యాంకు రుణం మంజూరు, దాని తర్వాత వాహనం డెలివరీ వరకు అన్ని దశలు పేపర్ లెస్ గా సాగాల్సిందే. దీనివల్లే చాలామంది దరఖాస్తుకి దూరంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మరింత ప్రచారం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.


ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా..?


కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, అన్నిటికంటే మించి వినియోగదారులపై ఇంధన కొనుగోలు భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో వాహనాలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఏడు వాహన సంస్థలకు సంబంధించిన 17 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు 38 రకాల వాయిదాల పద్ధతిని ప్రభుత్వం డిజైన్ చేసింది. ఒక్కో ఉద్యోగికి వాహన రకాన్ని బట్టి నెలకు రూ. 4329 నుంచి రూ.2321 వరకు ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఎవరూ సుముఖత చూపకపోవడమే ఇక్కడ విశేషం.