AP News :  ఆంధ్రప్రదేశ్  లో పలువురు ఐఏఎస్‌  అధికారులను ఏపీ సర్కారు బదిలీలు చేసింది. ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీర పాండ్యన్‌, మార్క్ ఫెడ్ జేఎండీగా వీర పాండ్యన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ భవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ సీఎస్‌  ఆదిత్యనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఏపీ సర్కారు తెలిపింది. మరో వైపు  ఏపీ ఇన్‌ఛార్జ్‌ ఛీఫ్‌ సెక్రటరీగా కే. విజయానంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయానంద్ ప్రస్తుతం విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత ఛీఫ్‌ సెక్రటరీ సమీర్ శర్మ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆసుపత్రిలో ఉండటంతో విజయానంద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సమీర్ శర్మ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయిన తర్వాత సమీర్ శర్మ విధుల్లో చేరుతారు. అప్పటి వరకూ విజయానంద్ సీఎస్‌గా వ్యవహరిస్తారు.  
 
సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను మళ్లీ ఏపీకి తీసుకురావడం అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. ఆయనకు ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌కు రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.  ఆయన గతంలో సీఎంవోలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పదమైన జీవోలు వెలుగులోకి రావడంతో ఆయనను పలు బాధ్యతల నుంచి తప్పించారు. సీఎంవోలో సీఎం రాజకీయ కార్యదర్శిగానూ వ్యవహరించారు. కొన్నాళ్ల తర్జన భర్జన తర్వాత ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. 


ప్రవీణ్ ప్రకాష్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదని అధికారవర్గాలు చ ెబుతున్నాయి.  ఆయన ఓ సందర్భంలో యూపీ రాజకీయాల్లోకి కూడా వెళ్తారన్న ప్రచారం జరిగింది. చివరికి ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్‌గా వెళ్లారు. ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ తనకు సీఎంవో పోస్టింగ్ ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ పెద్దలను కోరినట్లుగా తెలు్సతోంది. అయితే  ఇప్పుడే కాదని.. తర్వాత చూద్దామని చెప్పి ఆయనకు ప్రస్తుతానికి ఆర్ అండ్ బీ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  


ఇటీవలి కాలంలో వరుసగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధను మంగళవారం బదిలీ చేశారు. వారం రోజుల కిందట  పలువురు ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపకశాఖ.. సాధారణ పరిపాలన శాఖ, ఏపీ స్టేట్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్​లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులకు స్థానచలనం కల్పించింది. మెుత్తం ముగ్గురిని బదిలీ  చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వరుసగా అధికారులను బదిలీ చేస్తూండటంతో యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తున్నారని అనుకుంటున్నారు.