కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ గురించి వ్యక్తిగత వివరాలు చాలా మందికి తెలియదు. కేజీఎఫ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్యూల్లో ఆయన తాను తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పుకున్నారు. కేజీఎఫ్ సినిమాలో హీరో తన తల్లి సమాధిని అమాంతం తీసుకు వచ్చి సొంత ఇలాఖాలో పెట్టేసుకుంటాడు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురంచి చెప్పాడు.  తన తాత చనిపోతే సొంత ఇల్లు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది ఎదురయిందని అందుకే రాత్రికి రాత్రే ఏపీలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందన్నారు. తనకు ఎంతో ఇష్టమైన తాత సమాధిని తాను బాగా సంపాదించిన తర్వాత అలాగే తెచ్చుకోవాలనుకున్నానని చెప్పారు. తనకు సాధ్యం కాలేదుకాబట్టి సినిమాలో పెట్టానన్నారు. అప్పట్నుంచి ప్రశాంత్ నీల్ స్వగ్రామం ఏదన్న ఆసక్తి సినీ అభిమానుల్లో ప్రారంభమయింది.


ప్రశాంత్ నీల్ కుటుంబంపూర్తి వివరాలను ఏబీపీ దేశం సేకరించింది. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన వారు. నీలకంఠాపురం అంటే ఏపీలో అందరికీ పరిచయమే. మాజీ మంత్రి ..పీసీసీ మాజీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి  స్వగ్రామం అది. వారి ఇంటి పేరు ఊరి పేరు కూడా ఒక్కటే.  ప్రశాంత్ ఇంటి పేరు కూడా నీలకంఠాపురమే. అయితేపూర్తిగా కాకుండా ప్రశాంత్ నీల్ అని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. 


నీలకంఠాపురం రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ సమీప బంధువు కూడా.  రఘువీరారెడ్డి తండ్రి,ప్రశాంత్ నీల్ తండ్రి ఇద్దరు అన్నదమ్ములు.  ప్రశాంత్ నీల్ తండ్రి పెళ్లి తరువాత పూర్తిగా బెంగళూరులో సెటిల్ అయ్యారు.  ప్రశాంత్ నీల్ తండ్రి పేరు నీలకంఠాపురం సుబాష్ రెడ్డి. రఘువీరారెడ్డికి బాబాయ్. గ్రామానికి ఎప్పుడు వచ్చినా ప్రశాంత్ నీల్ నిరాడంబరంగా ఉండేవారు.  ఆయన తండ్రి సమాధి కూడా నీలకంఠాపురంలోనే వుంది. చాలాసార్లు ఊరికి వచ్చినప్పటికి ఈ ప్రాంత వాసులకు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్న విషయం తెలియదు. ఈ విషయాన్న ఆయనే వెల్లడించేవరకు బయటకు రాలేదు. 


నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి సోదరుడు సుబాష్ రెడ్డి కొడుకు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా వుందంటున్నారు నీలకంఠాపురం వాసులు. భవిష్యత్ లో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నారు ఆ గ్రామ వాసులు.పిసిసి అద్యక్షుడిగా,మంత్రిగా నీలకంఠాపురంకు వెలుగు తీసుకువచ్చిన రఘువీరారెడ్డి వంశంలోనే,మరొకరు నీలకంఠాపురంకు అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చే విధంగా వుండడం ఆ వూరి వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.