Power Bill: అది కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని రామాలయం. ఊర్లో ఉండే చిన్న స్థాయి ఆలయం అది. రెండు మూడు లైట్లు, ఓ ఫ్యాన్ లాంటివి ఉంటాయి అంతే. రాత్రంతా వాటిని వేసే ఉంచాల్సి ఉంటుంది. అలా ప్రతి నెలా రూ. వెయ్యి వరకు కరెంటు బిల్లు వస్తుంది. చిన్న మొత్తంలో వచ్చే విద్యుత్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పట్లాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంటు బిల్లు కూడా వచ్చింది. ఆ బిల్లు కట్టలేనంత భారీ మొత్తంలో వచ్చింది. నెలనెలా రూ. వెయ్యి వచ్చే కరెంటు బిల్లు.. ఇప్పుడు రూ. 2 వేలు, రూ. 5 వేలో వచ్చిందనుకుంటే పొరబడినట్లే. కరెంట బిల్లు వచ్చిన మొత్తం చూస్తే కళ్లు తిరగాల్సిందే. ఏకంగా రూ. 4 కోట్ల 19 లక్షల 83 వేల 536 రావడంతో ఆలయ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. గత ఆగస్టు నెలలో ఒక కోటి 7 లక్షల 37 వేల 455 యూనిట్లు వినియోగించినట్లు మంగళవారం వచ్చిన బిల్లులో చూపడంతో అవాక్కయ్యారు. వెంటనే విద్యుత్ శాఖ ఏఈ ప్రమోద్ ను కలిశారు ఆలయ నిర్వాహకులు. ఆయన బిల్లును పరిశీలించి మీటర్ రీడింగ్ ను స్కాన్ చేసే సమయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని.. తక్షణమే ఆ బిల్లును సరిచేసి కొత్త బిల్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆలయ నిర్వాహకులు శాంతించారు.


ఇటీవలే కర్ణాటకలో ఇలాంటి ఘటనే..!


కర్ణాటక ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌ మెంట్‌ ఓ 90 ఏళ్ల వృద్ధురాలికి కరెంట్‌ బిల్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఉండే చిన్న గదికే రూ.1.03 లక్షల బిల్ వచ్చిందని రిసీట్‌ చేతిలో పెట్టింది. ఇది చూసి ఆమె ఒక్కరే కాదు. మొత్తం ఊరే కంగుతింది. కొప్పాల్ జిలాల్లో జరిగిందీ ఘటన. ఈ వృద్ధురాలు కొడుకుతో కలిసి ఓ చిన్న ఇంట్లో ఉంటోంది. అందులో ఉన్నది రెండే రెండు బల్బ్‌లు. కానీ బిల్‌ మాత్రం ఏదో షాపింగ్ కాంప్లెక్స్‌కి వచ్చినంత వచ్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..కొప్పాల్ జిల్లాలోని భాగ్యనగర్‌ గ్రామంలోని గిరిజమ్మ ఇంటికి ఇంత బిల్‌ జనరేట్ అయింది. ఆ ఇల్లు Gulbarga Electricity Supply Company Limited  పరిధిలో ఉంది. ఆ బిల్‌ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె..."ఇంత బిల్ నేనెక్కడ కట్టేది" అని వాపోతోంది. 


"నా కొడుకుతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాను. వాడు కూలీ పని చేసుకుంటున్నాడు. ఇంత బిల్‌ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఎలా కట్టాలో కూడా తెలియడం లేదు. మీ మీడియా వాళ్లే ఏదో రకంగా సాయం చేసి ఈ సమస్య నుంచి బయటపడేయండి"


- గిరిజమ్మ, బాధితురాలు


టెక్నికల్ గ్లిచ్..


ఇదే ఇంటికి గతంలో నెలకు రూ.70-80 మాత్రమే బిల్ వచ్చేది. ఇది విన్న వెంటనే అధికారులు గిరిజమ్మ ఇంటికి వచ్చారు. మీటర్‌ని చెక్ చేశారు. టెక్నికల్ సమస్య కారణంగానే ఇలా జరిగిందని తేల్చి చెప్పారు. అంత డబ్బు కట్టాల్సిన పని లేదని ఆమెకు వివరించారు. అప్పటికి ఆ ముసలావిడ మనసు శాంతించింది.