Polling for ZPTC by elections ends amid tensions: కడపజిల్లాలో రెండు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా ఎలాంటి ఘర్షణలు జరగలేదు. ఒంటి మిట్టలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు దిగడంతో అక్కడకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్లారు. పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన సమయంలో కొన్ని చోట్ల.. పోలింగ్ స్టేషన్లకు దూరంగా దాడులు జరిగాయి. ఆ తర్వాత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
అన్ని పార్టీల ముఖ్య నేతల హౌస్ అరెస్టులు
ఉదయమే అన్ని పార్టీల ముఖ్య నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, ఎంపీ అవనాష్ రెడ్డిలను ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వారిని వదిలి పెట్టారు. అయితే మధ్యలో అవినాష్ రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులకు తెలియకుండా వచ్చేసి పులివెందుక వైసీపీ ఆఫీసుకు వెళ్లడం ఉద్రిక్తలకు కారణం అయింది. అక్కడ డీఎస్పీ .. వైసీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి కాల్చిపడేస్తానని హెచ్చరించడం వివాదాస్పదమయింది.
ఎనభై శాతం వరకూ పోలింగ్
పోలింగ్ దాదాపుగా ఎనభై శాతం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అన్ని చిన్న చిన్న గ్రామాలే అయినా.. వర్గ పోరాటాలు ఉండటంతో పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ సతీష్ కుమార్ అక్కడే రోజంతా ఎన్నికలను పర్యవేక్షించారు. వైసీపీ నేతలు ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకు వచ్చారని ఆరోపించారు. గ్రామాల్లోని మహిళలు వారి ఓట్లను వారిని వేయనివ్వలేదని.. రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపణ
ఈ ఎన్నికలు సరిగ్గా జరగలేదని.. న్యాయపోరాటం చేస్తామని వైఎస్ అవినాష్ రెడ్డి ప్రకటించారు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కడపలోని ఉర్దూ యూనివర్సిటీకి తరలించారు. గురువారం ఉదయం కౌంటింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ల ఎన్నిక కావడంతో .. గురువారం సాయంత్రానికి ఫలితంపై స్పష్టత వస్తుంది. ఈ ఎన్నికలపై ఇప్పటికే పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.
ఓడిపోతారని తెలిసే వైసీపీ ఆరోపణలు చేస్తోందంటున్న టీడీపీ
వైసీపీ నేతల స్పందన నిరాశాజనకంగా ఉంది. తాము గెలుస్తామని వారు చెప్పడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తున్నారు. ఫలితాలు రాక ముందే ఓటమికి కారణాలు చెబుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికపై న్యాయస్థానంలో సవాల్ చేయాలని వైసీపీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.